ప్రభుత్వ ఉపాధ్యాయులకు యూనిఫామ్?
posted on Apr 4, 2012 9:02AM
బడికివెళ్ళే పిల్లలేకాదు ఉపాధ్యాయులకు కూడా యూనిఫామ్ ధరించాలని ప్రభుత్వం ఆదేశించబోతోంది. ఈ మేరకు రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరిపిన తరువాత ఉత్తర్వులు జారీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులయిన వైద్య ఆరోగ్య సిబ్బంది, ఐసిడిఎస్, పోలీస్ శాఖ, ఎక్సైజ్, అటవీశాఖ, ట్రాన్స్ పోర్టు శాఖ సిబ్బంది యూనిఫామ్ ధరిస్తున్నారు. అలాగే ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు కూడా యూనిఫామ్ ధరించి పాఠశాలలకు వెళ్ళవలసి ఉంటుంది.
పురుష ఉపాధ్యాయులు లేత నీలం రంగు దుస్తులు, మహిళా ఉపాధ్యాయులు గ్రే కలర్ చీరలు, ప్రధానోపాధ్యాయులు నలుపురంగు కోట్లు ధరించి పాఠశాలలకు వెళ్ళి విద్యాబోధన చేయాలని ప్రభుత్వం ఆదేశించబోతోంది. వచ్చే ఏడాది నుండి ఈ నిబంధన అమలుచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ప్రభుత్వ యోచనకు ఉపాధ్యాయ సంఘాలు ఎంతవరకు సహకరిస్తాయో వేచి చూడాల్సిందే.