వైఎస్ అవినాష్ రెడ్డి ఖేల్ ఖతం? అరెస్టుకు రంగం సిద్ధం!?

సామాజిక మాధ్యమంలో అనుచిత పోస్టులు, ప్రత్యర్థులపై దూషణలకు పాల్పడిన వారిపై ఇటీవల ఏపీ పోలీసులు సీరియస్ గా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై ఫిర్యాదు అందగానే పోలీసులు రియక్ట్ అవుతున్నారు. జగన్ హయాంలో ఈ పరిస్థితి  ఉండేది కాదు. వైసీపీ సోషల్ మీడియా వింగ్ బూతుల‌కు కర్మాగారంగా మారిపోయి.. అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన నేతలు, మహిళా నేతలపై అసభ్య పోస్టులు, మార్ఫింగ్ ఫొటోల‌తో రెచ్చిపోయింది. అలా రెచ్చిపోయిన వారికి అప్పటి సీఎం జగన్ ప్రోత్సాహం, అండదండలు ఉండేవన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో కొంద‌రు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, లోకేశ్ పై, వారి కుటుంబ స‌భ్యుల‌పై సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌ పోస్టులు పెట్టారు. అలాంటి వారిపై ప్ర‌స్తుత ఎన్డీయే కూట‌మి   కొర‌డా ఝ‌ళిపిస్తున్నది. ఇప్ప‌టికే ప‌లువురిని పోలీసులు అరెస్టులు చేయ‌గా.. మ‌రికొంద‌రిపై కేసులు న‌మోదు చేశారు. పులివెందుల వైసీపీ సోషల్‌ మీడియా  కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అత‌ని విచారణలో  విస్తుపోయే విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. 

ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో వందల మంది వైసీపీ కార్యకర్తలకు బూతు పోస్టులు పెట్టేందుకు, మార్ఫింగ్‌లు చేసేందుకు, అప్పటి ప్రతిపక్ష నేతల కుటుంబాలపై తప్పుడు ప్రచారాలు చేసేందుకు జీతాలు ఇచ్చేవార‌ని పోలీసుల విచార‌ణ‌లో వర్రా రవీందారెడ్డి చెప్పిన‌ట్లు తెలిసింది. వ‌ర్రాతో పాటు ఇంటూరి రవి కిరణ్ కూడా పే రోల్ లో ఉన్నారు. మొత్తంగా న‌ల‌బైకు పైగా యూట్యూబ్ చానళ్లు నిర్వహిస్తున్న కార్యకర్తలకూ డిజిటల్ కార్పొరేషన్ నుంచి చెల్లింపులు చేసినట్లుగా తెలిసింది. ఈ వ్యవహారంలో లోతైన దర్యాప్తు జరిగితే చాలాపెద్ద కేసు అవుతుందని పరిశీలకులు అంటున్నారు. అసలు ఇలాంటి   పనులు చేయడమే తప్పు అయితే ప్రజాధనాన్ని జీతాలుగా ఇచ్చి మరీ సోషల్ మీడియాలో ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు   పెట్టించడం సంచలనంగా మారింది. ఈ అంశంలో అప్పటి ప్రభుత్వ పెద్దల కుట్ర ఖచ్చితంగా ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్ లో పోస్టులు పెట్టిన ఆర్జీవీకి కూడా ఎన్నికలకు ముందు డబ్బులు చెల్లించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇవన్నీ బయటకు తీసి అసలు తప్పుడు ప్రచారం.. పేక్ పోస్టుల కుట్ర ఏమిటో లెక్క తేల్చే ప‌నిలో పోలీసులు నిమ‌గ్న‌మ‌యిన‌ట్లు తెలుస్తోంది. 

వ‌ర్రా ర‌వీంద‌ర్ తోపాటు సుబ్బారెడ్డి, ఉద‌య్ ల‌ను పోలీసులు మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టారు. క‌ర్నూల్ రేంజ్ డీఐజీ కొయ్య ప్ర‌వీణ్ ఈ కేసుకు సంబంధించిన విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఆర్గ‌నైజ్డ్ గా నేర‌పూరిత సామ్రాజ్యాన్ని వీళ్లు నెల‌కొల్పారు. ముఖ్యంగా వైఎస్ ష‌ర్మిళ‌, వైఎస్ విజ‌య‌మ్మ‌, సునీత‌ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్ట‌డం వెనుక ఎంపీ అవినాశ్ రెడ్డి ప్ర‌మేయం ఉంద‌ని వ‌ర్రా ర‌వీంద‌ర్ రెడ్డి పోలీసుల విచార‌ణ‌లో స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలిసింది. వైఎస్ వివేకానంద హ‌త్య కేసులో ప్ర‌దాన ముద్దాయి అవినాశ్ రెడ్డి అని ష‌ర్మిళ‌, సునీత‌లు ప‌దేప‌దే చెబుతూ వ‌చ్చారు. వైఎస్ వివేకా హత్య కేసు  విచార‌ణలో ఉంది. 

అయితే, ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో అవినాశ్ రెడ్డి చిన్న‌పిల్ల‌వాడు అని, ఆయ‌న‌పై ష‌ర్మిళ‌, సునీత అస‌త్య ప్ర‌చారం చేస్తున్నారంటూ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. అప్ప‌ట్లో ప్ర‌జ‌లు సైతం జ‌గ‌న్ మాట‌ల‌ను న‌మ్మి వైఎస్ అవినాశ్‌రెడ్డిని మ‌రోసారి ఎంపీగా గెలిపించారు. ప్ర‌స్తుతం వ‌ర్రా ర‌వీంద్ర రెడ్డి చెప్పిన విష‌యాల‌ను బ‌ట్టిచూస్తే.. ష‌ర్మిళ‌, సునీత‌, విజ‌య‌మ్మ‌ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్ట‌డం, మార్ఫింగ్ ఫొటోల‌తో అస‌భ్య‌క‌ర ఫొటోలు సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డంలో అవినాశ్ రెడ్డే సూత్ర‌దారి అని తేలుతోంది.

వ‌ర్రా ర‌వీంద్ర రెడ్డి భార‌తీ సిమెంట్ లో ఉద్యోగి. అయితే, ఆయ‌న పూర్తిగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్ట‌డం, సోష‌ల్ మీడియా గ్రూపుల‌ను హ్యాడిల్ చేయ‌డం చేసేవార‌ని పోలీసుల విచార‌ణ తేలింది. తాడేప‌ల్లిలోని వైసీపీ సోష‌ల్ మీడియా ప్ర‌ధాన కార్యాల‌యం నుంచి వ‌చ్చిన ఆదేశాల మేర‌కు వ‌ర్రా ర‌వీంద్ర‌రెడ్డి న‌డుచుకునేవారు.  ష‌ర్మిళ‌, విజ‌య‌మ్మ‌, సునీత‌ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టేవాడు. ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘ‌వ రెడ్డి నుంచి వ‌చ్చిన కంటెంట్ ను, మార్ఫింగ్‌ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో వ‌ర్రా ర‌వీంద్ర రెడ్డి స‌ర్క్యులేట్ చేసేవారు. ప‌లు సందర్భాల్లో రాఘ‌వ‌రెడ్డితో ఫోన్లో మాట్లాడే స‌మ‌యంలో.. ప‌క్క‌నే అవినాశ్ రెడ్డి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేయాల్సిన కంటెంట్ ను రాఘ‌వ‌రెడ్డితో చెబుతుండ‌టాన్ని గుర్తించిన‌ట్లు ర‌వీంద్రరెడ్డి పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డించిన‌ట్లు డీఐజీ పేర్కొన్నారు. దీంతో ష‌ర్మిళ‌, సునీత‌, విజ‌య‌మ్మ‌ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టుల పెట్ట‌డం వెనుక అవినాశ్ రెడ్డి ఉన్నారని స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే, ఈ విష‌యంపై లోతుగా విచార‌ణ చేస్తామ‌ని పోలీసులు చెప్పారు. త‌న‌పై త‌ప్పుడు పోస్టుల‌కు సంబంధించి సునీత ఇప్ప‌టికే హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశార‌ని, ఆ ఫిర్యాదును సైబ‌ర్ క్రైంవారు మాకు బ‌దిలీ చేస్తే విచార‌ణ చేస్తామ‌ని డీఐజీ చెప్పారు. ఒక‌వేళ సునీత వ‌చ్చి మాకు ఫిర్యాదు ఇచ్చినా విచార‌ణ చేస్తామ‌ని చెప్పుకొచ్చారు. వైఎస్ కుటుంబంలోని ఆడ‌వారిపై సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టుల వెనుక ఎంపీ అవినాశ్ ఉన్నారన్న స్ప‌ష్ట‌త వ‌స్తుండ‌టంతో ఆయ‌న అరెస్టుకు సైతం పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతున్నది.