బొత్సకు చెక్..తెరపైకి డీఎస్?

న్యూఢిల్లీ: పిసిసి తెరపైకి మరలా డి.శ్రీనివాస్‌ను తేవడం ద్వారా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ గందరగోళానికి తెరదించాలని హైకమాండ్ యోచిస్తున్నట్టు సమాచారం. మంగళవారం ఉదయం కాంగ్రెస్ అధినేత్రి సోనియాను విధానమండలి సభ్యుడు డిఎస్ కలుసుకుని రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలపై ఇరవైఐదు నిమిషాలపాటు చర్చించారు. హైకమాండ్ పిలుపుమేరకే సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న శ్రీనివాస్‌కు, మంగళవారం ఉదయమే సోనియా అప్పాయింట్‌మెంట్ లభించింది. సిఎం కిరణ్, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొన్న తరుణంలో, డిఎస్‌ను తెరపైకి తేవడం ద్వారా రాజకీయ అనిశ్చితికి ఫుల్‌స్టాప్ పెట్టాలన్నది హైకమాండ్ ఆలోచన. శ్రీనివాస్ గతంలో రెండుసార్లు పిసిసి అధ్యక్ష పదవి నిర్వహించటంతోపాటు, తన హయాంలో రెండుసార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన ఘనత దక్కించుకున్నారు. ఇప్పుడాయన మూడోసారి పిసిసి అధ్యక్ష పదవి చేపట్టే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మంగళవారం సోనియాను కలిసిన డిఎస్, రాష్ట్ర రాజకీయాలను చర్చించారు.

కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేకంగా పిలిపించి సమాలోచనలు జరపటం అంటే, మూడోసారి పిసిసి చాన్స్ కట్టబెట్టేందుకేనన్న మాట పార్టీ వర్గాలనుంచి వినిపిస్తుంది. రాజకీయ విభేదాలతో రగులుతున్న కిరణ్, బొత్సలలో ఒకరిని తప్పించటం ద్వారా పరిస్థితిని సాధారణ స్థాయికి తేవాలని హైకమాండ్ యోచిస్తోంది. కిరణ్‌ను ఇప్పటికప్పుడే సిఎం పదవినుంచి తొలగించటం సాధ్యం కాదు కాబట్టి, మొదట బొత్సను పిసిసి నుంచి తప్పించి, అదే సామాజిక వర్గానికి చెందిన డిఎస్‌ను నియమించాలని హైకమాండ్ ఆలోచిస్తోంది. 2004, 2009లో కాంగ్రెస్ విజయం సాధించినప్పుడు డిఎస్ పిసిసి అధ్యక్షుడిగా పని చేయటం తెలిసిందే. ఇప్పుడు పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న తరుణంలో శ్రీనివాస్‌ను మరోసారి రంగంలోకి తెస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. సిఎం కిరణ్‌ను ఢీకొంటున్న బొత్స మెడకు మద్యం సిండికేట్ల కుంభకోణం చుట్టుకోవటంతో పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఏఐసిసి ఆలోచిస్తున్నట్టు కూడా చెప్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu