ప్రభుత్వాన్ని కూల్చాల్సిన బాధ్యత జగన్‌దే
posted on May 31, 2011 9:19AM
హైదరాబాద్: 'రాబోయే
అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెడతాం!'... ఇది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విస్పష్టంగా చేసిన ప్రకటన. ఓ తెలుగు న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ సంగతి తేల్చి చెప్పారు. పిల్లి మెడలో గంట కట్టేదెవరో తేలిపోయింది! ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఈ 'అవిశ్వాసం' ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది? కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు నిజంగానే పడిపోతుందా? ప్రజారాజ్యాన్ని విలీనం చేసుకుని, ఎంఐఎం ఎమ్మెల్యేల మద్దతు పొందుతున్న కిరణ్ సర్కారు ప్రస్తుతం 'సురక్షిత'మైన స్థానంలో ఉంది.పైగా... జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఏమాత్రం తోక జాడించినా వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉండనే ఉంది. వీటన్నింటి దృష్ట్యా... సభలో అవిశ్వాస తీర్మానం పెట్టినా, తానే విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చినా ప్రభుత్వం క్షేమంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇలాంటప్పుడు అవిశ్వాసం ప్రవేశపెడతామని చంద్రబాబు ఎందుకంటున్నారు? దీని ద్వారా ఆయన ఏం సాధిస్తారనే ప్రశ్న తలెత్తవచ్చు. ప్రతిపక్షం అవిశ్వాసం ప్రకటించడం వెనుక ప్రధాన లక్ష్యం... ప్రభుత్వాన్ని పడగొట్టడం ఒక్కటే కాకపోవచ్చు. అవిశ్వాసం ద్వారా విపక్షం అనేక లక్ష్యాలను సాధించుకుంటుంది.
"నేను కన్నెర్ర చేస్తే సర్కారు కూలిపోతుంది! ఈ ప్రభుత్వం నా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతుకుతోంది! నాన్న తెచ్చిన ప్రభుత్వం కాబట్టి కూల్చకుండా వదిలేస్తున్నా'' అంటూ వైఎస్ జగన్ పదే పదే ప్రకటించారు. ఆ తర్వాత... 'నాకు బలంలేకే కదా! మిమ్మల్ని పెట్టమంటున్నాం!' అంటూ చేతులెత్తేశారు. మహానాడులో చంద్రబాబు సవాల్ తర్వాత జగన్ వర్గం ఒక్కసారిగా ఆత్మ రక్షణలోకి పడిపోయింది. ఇప్పుడు చంద్రబాబు మరో అడుగు ముందుకేసి... తదుపరి సమావేశాల్లో అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ మరింత ఇరుకున పడింది. అంతకుముందు చేసిన ప్రకటనలు, హెచ్చరికల నేపథ్యంలో ఎట్టిపరిస్థితుల్లో సర్కారును పడగొట్టి తీరాల్సిన 'బాధ్యత' జగన్‌పై పడింది. వెరసి... చంద్రబాబు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గించాల్సిన బాధ్యత కూడా ఆయనదే. దీనికోసం ఆయన భారీ సంఖ్యలో మద్దతు కూడగట్టాల్సి ఉంది. ఆ స్థాయి బలం జగన్‌కు లేదని ఆయనే ఒప్పుకొన్నారు. చేతిలో ఉన్న కొద్దిమందితో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే... అసలుకే ముప్పు వస్తుంది. వారందరిపై అనర్హత వేటు పడుతుంది. ఇక... సర్కారును కూలగొట్టేంత స్థాయిలో మద్దతు కూడగట్టి, అనుకున్నది సాధించినా... ప్రభుత్వాన్ని పడగొట్టిన ఖ్యాతి అవిశ్వాసం ప్రవేశపెట్టిన తెలుగుదేశానికే దక్కుతుంది. ఏ విధంగా చూసుకున్నా జగన్ పార్టీకే ఇది అగ్నిపరీక్షగా మారనుంది. ఇప్పటిదాకా జగన్ చేసిన దీక్షల్లో అన్ని పార్టీల వారు కలిపి గరిష్ఠంగా 32 మంది వరకు పాల్గొన్నారు. ఆ సంఖ్య చాలాసందర్భాల్లో 20 నుంచి 25 మధ్య మాత్రమే ఉంది. దీక్షలు, యాత్రల సంగతి ఎలా ఉన్నా... నిజంగా అవసరం వచ్చినప్పుడు జగన్ వెంట ఎంతమంది ఉన్నారన్నది అవిశ్వాస తీర్మానంతో తేలిపోతుంది. మంగళవారం జరగనున్న పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో, బుధవారం జరగనున్న రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానంపై సహచరులతో జగన్ చర్చించనున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.