నెల నెల నివేదికలు ఇవ్వండి.. జగన్ సర్కార్ కు గవర్నర్ ఆదేశం

జగన్ సర్కార్ పై కేంద్రం నిఘా ఆరంభమైందా? ఇంత కాలం అన్ని విధాలుగా జగన్ సర్కార్ కు చేదోడు వాదోడుగా ఉన్న మోడీ సర్కార్ ఇకపై అలా ఉండదా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. 
ఏపీ ప్రభుత్వం ఇక నుంచి తనకు నెలవారీ నివేదికలు పంపాలని   గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదేశాలు జారీ చేశారు.  గవర్నర్ ఇలా ఆదేశించడాన్ని కొందరు తప్పుపడుతుంటే.. మరి కొందరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు నెలవారీ నివేదికలు పంపడం సాధారణ ప్రక్రియలో భాగమేనంటున్నారు.

ఆ సాధారణ ప్రక్రియను జగన్ సర్కార్ అమలు చేయడం లేదు కనుకనే గవర్నర్ ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చిందని చెబుతున్నారు.  అయితే వైసీపీ అనుకూలురు మాత్రం ఇది   కేంద్ర ప్రభుత్వ నిఘాగా అభివర్ణిస్తున్నారు.  విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు  గత నెల 29న గవర్నర్ కార్యాలయం నుంచి పాలనాపరమైన అంశాలపై ప్రతినెలా నివేదిక పంపాలంటూ సాధారణ పరిపాలన శాఖకు లేఖ అందింది.  రాష్ట్ర ప్రభుత్వ పాలన, ఆర్థిక అంశాలపై విపక్ష పార్టీలు తరుచూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కీలక శాఖల పనితీరుపై నెలవారి నివేదికలు పంపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ కార్యాలయం ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

జగన్ ప్రభుత్వంపై వస్తున్న  ఆరోపణల నేపధ్యంలో...రాష్ట్ర ప్రభుత్వ పాలనపై గవర్నర్  అబ్దుల్ నజీర్ దృష్టిసారించారు.  రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలు,   ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన సహా అన్ని పార్టీలు వేలెత్తి చూపుతున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందంటూ ఆయా పార్టీలు ప్రభుత్వంపై విమర్శులు సంధిస్తున్నారు. కొందరు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ క్రమంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం నిశితంగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఏడాదిలో ఎన్నికలు జరగ నున్న నేపథ్యంలో గవర్నర్ కార్యాలయం స్పందించడం కీలక పరిణామంగా చెబుతున్నారు.

గత తెదేపా ప్రభుత్వంలో కూడా ఎన్నిలకు ముందు ఇదే తరహాలో గవర్నర్ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లిన విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ కలిసి 2014లో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఎన్నికలకు ఏడాది ముందు రెండు పార్టీల మధ్య సఖ్యత చెడింది. అటు కేంద్రం నుంచి టీడీపీ, ఇటు రాష్ట్రం నుంచి బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం నుంచి తప్పుకున్నాయి. ఈ క్రమంలోనే అప్పటి గవర్నర్ ప్రభుత్వ పాలనాంశాలపై నెలవారీ నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించారు.   వివిధ రాజ కీయ పార్టీల నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పథకాలు దుర్వినియోగం కాకుండా కట్టడి చేయడంలో భాగంగానే గవర్నర్ నుంచి ఈ ఆదేశాలు వచ్చాయని భావిస్తున్నారు.