కోడెల మొబైల్ ఎక్కడ? ఆత్మహత్యకు ముందు చివరి ఫోన్ కాల్ ఎవరిది?
posted on Sep 18, 2019 11:38AM
రాజకీయ వేధింపులు తట్టుకోలేక, తీవ్ర మానసిక క్షోభతోనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నా... కోడెల ఆకస్మిక మరణం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. మొత్తం కోడెల ఎపిసోడ్ లో మొబైల్ ఫోన్ కీలకంగా మారిందంటున్నారు. ఆత్మహత్యకు ముందు దాదాపు అరగంటపాటు కోడెల ఓ ఫోన్ కాల్ మాట్లాడారని, ఆ తర్వాత అది స్విచ్ఛాఫ్ అయ్యిందని అంటున్నారు. అనంతరం మొబైల్ కనిపించకుండా పోవడంతో, అసలు కోడెల మొబైల్ ఫోన్ ఎక్కడుంది? చివరిగా ఎవరితో మాట్లాడారు? ఏం మాట్లాడారు? ఫోన్ కాల్ తర్వాతే మొబైల్ ఎందుకు స్విచ్ఛాఫ్ అయింది? అసలు ఫోన్ ను మాయం చేసిందెవరనే కోణంలో తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కోడెల సూసైడ్ రాజకీయ రంగు పులుముకోవడంతో, ఆత్మహత్యకు ముందురోజు సాయంత్రం అసలేం జరిగిందనే దానిపై పోలీసులు దృష్టిపెట్టారు. అలాగే, ఆత్మహత్యకు ముందురోజు నుంచి సూసైడ్ చేసుకున్న చివరి నిమిషం వరకు ఎవరెవరితో మాట్లాడారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఇంట్లో ఆధారాలు, ఫింగర్ ప్రింట్స్ సేకరించిన పోలీసులు.... కోడెల మొబైల్ ఫోన్ మాయం కావడంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కోడెల ఇంట్లో పనిమనుషులను, వాచ్ మెన్ ను ప్రశ్నించిన పోలీసులు... గన్‌మెన్లు, డ్రైవర్ నుంచి కూడా వాంగ్మూలం తీసుకున్నారు. అలాగే, కోడెల కూతురు విజయలక్ష్మితోపాటు కుటుంబ సభ్యులందరి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. ఇక త్వరలోనే కోడెల కుమారు శివరామ్‌ను కూడా ప్రశ్నించనున్నారు. కోడెల అంత్యక్రియలు ముగిసిన తర్వాత శివరామ్‌ను విచారించే అవకాశం కనిపిస్తోంది.
అయితే, కేసు దర్యాప్తులో కోడెల ఫోనే అత్యంత కీలకంగా మారడంతో, టెక్నికల్ ఎవిడన్స్ కోసం మొబైల్ ఇవ్వాలని కుటుంబ సభ్యులను కోరగా, తమకు తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తోన్న పోలీసులు... ఆత్మహత్యకు ముందు కోడెల మాట్లాడిన చివరి కాల్ పై అనుమానం వ్యక్తంచేస్తున్నారు. దాదాపు 24 నిమిషాలపాటు సాగిన ఆ సంభాషణ... ఎవరితో... ఏం మాట్లాడారన్న దానిపై వివరాలు సేకరిస్తున్నారు. అయితే, ఆ ఫోన్ కాల్ తర్వాతే కోడెల మొబైల్ స్విచ్ఛాఫ్ అయ్యిందని గుర్తించారు. అంతేకాదు ఆ ఫోన్ కాల్ తర్వాతే కోడెల డల్ అయిపోయారని, కొద్దిసేపటికే ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు. అయితే, ఆ మొబైల్ దొరికితేనే, కోడెల సూసైడ్ మిస్టరీ వీడుతుందంటున్నారు.