ఏసీబీ కంటే ముందు ఈడీ – కేటీఆర్‌కు నోటీసులు !

ఫార్ములా ఈ రేసు కేసులో  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఉచ్చు గట్టిగానే బిగుస్తోంది.  ఒక వైపు ఈ కేసులో ఏసీబీ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడమే కాకుండా దర్యాప్తు కూడా ప్రారంభించింది. దీనిపై కోర్టుకు వెళ్లిన కేటీఆర్ స్వల్ప ఊరటను పొందారు. అసలింకా ఏసీబీ కేటీఆర్ కు నోటీసులు కూడా జారీ చేయలేదు. కానీ ఈ లోగానే  ఏసీబీ కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ దూకుడు పెంచింది.

ఈ కేసులో వచ్చే నెల 7న విచారణకు హాజరు కావాల్సిందిగా కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది.  ఫార్ములా ఈ రేసు విషయంలో డబ్బులు విదేశాలకు తరలించిన వ్యవహారంలో ఈడీ పకడ్బందీగా అడుగులు వేస్తోంది.  ఈ కేసులో విచారణకు రావాలంటూ కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీయే మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. అయితే వీరిరువురినీ కేటీఆర్ కంటే ముందుగానే అంటే జనవరి 2, 3 తేదీలలో విచారించనుంది.  ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ప్రివెంటివ్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ చట్టం కింద విచారణ జరుపుతున్న ఈడీ ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించింది.  ఎఫ్ఈవోకు 55 కోట్లు నగదు బదిలీ , ఆర్థిక పరమైన అవకతవకలు జరిగినట్లు గుర్తించింది.  ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసు అవినీతికి సంబంధించింది. అయితే ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో అవినీతి జరగలేదని కేటీఆర్ గట్టిగా చెబుతున్నారు. అయితే ఈడీ మాత్రం ప్రభుత్వ సొమ్మును అక్రమంగా తరలించారంటూ కేసు పెట్టింది. ఏదో రూపంలో సొమ్ములు తరలించినట్లు కేటీఆర్ కూడా అంగీకరిస్తున్నారు. అదే సమయంలో ఆ తరలింపుతో తనకు సంబంధం లేదని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇక్కడే ఈడీ రంగంలోకి దిగింది. అక్రమంగా సొమ్ములు తరలింపులో కేటీఆర్ ప్రమేయం ఉందా లేదా అన్నది ఈడీ తేలుస్తానంటూ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కన్నా ఈడీ దూకుడుగా వ్యవహరించడం కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు ఆందోళన కలిగించే అంశమే.  అసలు ఈ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ న్యాయ సలహా తీసుకున్న తరువాత అనుమతి ఇవ్వడంతోనే ఏదో తప్పు జరిగిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇప్పుడు కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేయడంతో కేటీఆర్ కు ఉచ్చు బిగిసిందన్న భావన రాజకీయ వర్గాలలో కూడా వ్యక్తం అవుతోంది.