తెలుగుదేశానికే జై ‘గంటా’

మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు గంటా శ్రీ‌నివాస్‌రావు పార్టీ మారబోతున్నారంటూ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గ‌తంలోనూ గంటా గోడ దూకేస్తున్నారన్న వార్తలు వెల్లువెత్తాయి. ఆయ‌న ఈ వార్తలపై ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. పార్టీ మారలేదు.  అయితే మొక్కుబడిగా తాను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాననీ, పార్టీ మారే ప్రశక్తే లేదనీ చెబుతూ వచ్చారు.

అయితే ఇటీవ‌ల మ‌రోసారి గంటా పార్టీ మారుతున్నార‌ని, వైసీపీ త‌ర‌పున ఆయ‌న వ‌చ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఏపీ రాజ‌కీయాల్లో జోరుగా చ‌ర్చ మొదలైంది. గంటా వ‌ర్గీయులు మాత్రం ఆయ‌న పార్టీ మార్పుపై ఎలాంటి స‌మాచారం లేద‌ని చెబుతూ వ‌చ్చాయి. కానీ, రోజురోజుకు గంటా పార్టీ మారుతున్నాడ‌ని వార్తలు విస్తృతంగా ప్రచారం జరిగింది. గంటా ముఖ్యమంత్రి జగన్ సమక్షంగా వైకాపా గూటికి చేరనున్నారనే కాక, ఆయన పార్టీ మారే ముహూర్తం కూడా ఫిక్సైపోయిందని వైసీపీ నేతలు ప్రకటనలు కూడా చేసేశారు.

జనవరిలో గంటా ఫ్యాన్ పార్టీలో చేరడం ఖాయమన్నట్లు చెప్పేశారు. ఈ నేపథ్యంలో గంటా ఈ సారి కాస్తంత గట్టిగానే తాను పార్టీ మారేది లేదని గట్టిగా చెప్పారు. తాను రాజకీయాలలో ఉన్నంత వరకూ చంద్రబాబుతోనే తన ప్రయాణం అని గంటా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీని వీడేది లేదంటూ విస్పష్టంగా ప్రకటించారు.  తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటాననీ, సామాజిక మాధ్యమాలలో ఎవేవో రాస్తుంటారు, వాటిని పట్టించుకోనవసరం లేదని గంటా పేర్కొన్నారు. గత కొంత కాలంగా తాను పార్టీ మారుతున్నానంటూ ప్రచారం జరగడం, నేను వివరణ ఇవ్వడం పరిపాటిగా మారిందన్నారు.

కాగా పార్టీ మారేది లేదని గంటా ఇచ్చిన వివరణతో తెలుగుదేశం శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయాల్లో ఉన్నంత వరకూ తాను చంద్రబాబుతోనే ఉంటానంటూ గంటా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో ఎప్పటిదన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు.