దేశంలో ఎలక్షన్ ఫీవర్

సార్వత్రిక ఎన్నికలు ఇంకా ఏణ్ణర్థం సమయం ఉంది. అయినా దేశం మొత్తం ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తోంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలూ ఎన్నికల మూడ్ లోనే ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, విపక్ష కాంగ్రెస్ సహా అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలూ కూడా ఎన్నికల సన్నాహాలలో నిండా నిమగ్నమయ్యాయి. అంతేనా.. ఇప్పటి నుంచే వ్యూహ ప్రతివ్యూహాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వేడి చల్లారకుండా రగులుస్తూనే ఉన్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ప్రత్యర్థి పార్టల నుంచి జంప్ జిలానీలను ప్రోత్సహించడమే కాదు.. పార్టీకి గ్లామర్ కోసం సెలబ్రిటీలనూ ఆశ్రయిస్తున్నాయి.

కేవలం సెలబ్రిటీలు పార్టీ  తరఫున మాట్లాడితే ఓట్లు పడతాయా అన్న సంశయం ఉన్నప్పటికీ.. వారి వల్ల తమ సభలకు జనం తరలివస్తారన్న నమ్మకం మాత్రం అన్ని పార్టీలలోనూ మెండుగా ఉంది. అమిత్ షా హైదరాబాద్ పర్యటనల సందర్భంగా ప్రముఖ సినీ నటులతో ప్రత్యేకంగా భేటీ కావడం, రాహుల్ గాంధీ భాతర్ జోడో యాత్రలో ప్రముఖ నటులు కలిసి నడవడం వంటి గిమ్మిక్కులన్నీ ఇందులో భాగమనే చెప్పాల్సి ఉంటుంది. నిజంగానే సీనీ గ్లామర్ ఓట్లను రాలుస్తుందా? అంటే నమ్మకంగా ఏ పార్టీ ఔనని చెప్పగలిగే పరిస్థితి లేదు. ఎందుకంటే తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ప్రజాదరణ ఉన్న నటులు సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి విజయం సాధించడంలో విఫలమైన ఉదంతాలు ఉన్నాయి. అయితే సినీ గ్లామర్ ఆయా పార్టీల  ర్యాలీలకు జనాన్ని రప్పించడానికి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంనద్న విశ్వాసం మాత్రం ఆయా పార్టీల నాయకుల్లో మెండుగా ఉంది. అందుకే పోటీలు పడి మరీ సెలబ్రిటీలకు పార్టీల నేతలు ఆహ్వానాలు పలుకుతున్నారు. 

ఈ ఎన్నికల  రేసును ముందుగా మొదలు పెట్టినది బీజేపీ అనే చెప్పాలి. హిమాచల్, గుజరాత్ ఎన్నికలు ముగిశాయి. మరో మూడు రోజులలో ఫలితాలు వస్తాయి. గుజరాత్ లో రెండో విడత పోలింగ్ ఇంకా పూర్తిగా ముగియక ముందే.. త్వరలో అంటే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై దృష్టి సారించాలంటూ ప్రధాని మోడీ బీజేపీ క్యాడర్ కు పిలుపు నిచ్చేశారు. సోమ,మంగళవారాలలో (డిసెంబర్ 5,6) బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆఫీస్ బేరర్స్ తో  జరిగే కీలక భేటీలో  2024 సార్వత్రిక ఎన్నికలలో  అవలంబించాల్సిన వ్యూహాలపై బీజేపీ అధ్యక్షుడు నడ్డా పార్టీ శ్రేణులకు వివరిస్తారు. ఎన్నికలలో అనుసరించాల్సిన ప్రచారంపై దిశానిర్దేశం చేస్తారు.

ఒక్క మాటలో చెప్పాలంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు రోడ్ మ్యాప్ పై ఆ సమావేశాల్లో చర్చిస్తారు.  సోమవారం (డిసెంబర్ 5న) జరిగిన భేటీలో ప్రధాని మోడీ  వర్చువల్ గా పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలే కాకుండా వచ్చే ఏడాది అంటే 2023లో కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికలపై ఇప్పటి నుంచే సీరియస్ గా దృష్టి పెట్టాలని మోడీ క్యాడర్ కు పిలుపు నిచ్చేశారు. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ అసెంబ్లీలకు కూడా ముందస్తు ఎన్నికలు వచ్చే ఏడాదే జరిగే అవకాశాలున్నాయన్న సంకేతాలు కూడా ఇచ్చారు.

రెండు రోజుల  బీజేపీ జాతీయఆఫీస్ బేరర్స్, అన్ని రాష్ట్రాల ఇంఛార్జులు, కో-ఇన్-ఛార్జులు, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీలతో రెండు రోజుల పాటు జరిగే సమావేశాల తొలి రోజు సోమవారం (డిసెంబర్ 5) జేసీ నడ్డా ప్రసంగించారు. మోడీ వర్చువల్ గా పాల్గొన్నారు. సమావేశం మంగళవారం (డిసెంబర్ 26) కూడా కొనసాగనుంది. అటు గుజరాత్ ఎన్నికల రెండో విడత పోలింగ్ పూర్తి కాకముందే బీజేపీ తదుపరి కార్యాచరణకు శ్రీకారం చుట్టేసింది. బీజేపీ తన స్పీడ్ తో ఇరత పార్టీలలో కూడా ఎన్నికల వేడిని రగిలించేసింది.  బీజేపీహంగామాతో ఇతర పార్టీలు సైతం ఎన్నికలసన్నాహాలకు శ్రీకారం చుట్టేశాయి. ఇక అన్నిటికీ మించి కేంద్రం బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో దర్యాప్తు సంస్థల ద్వారా ఆ ప్రభుత్వాలకు చిక్కులు సృష్టిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.  దర్యాప్తు సంస్థల దాడులతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను టెన్షన్ లోకి నెట్టేసి తాను మాత్రం ఎన్నికల సన్నాహాలను తాపీగా చేసుకుంటోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు  వరుసగా రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు ఉండటంతో దేశ వ్యాప్తంగా ఎలక్షన్ ఫీవర్ పీక్స్ లో ఉంది.