చంద్రబాబు విజన్ కు, విజ్ణతకు మోడీ ఫిదా!

ఆధికారంలో ఉన్నా.. విపక్షంలో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రత్యేకతే వేరు. ఆయనకు ఉన్న గుర్తింపే వేరు. గతంలోనూ ఇది పలుమార్లు రుజువైంది. తాజాగా ఢిల్లీలో సోమవారం (డిసెంబర్ 5)జి-20 సదస్సు సన్నాహకంపై జరిగిన అఖిల పక్ష సమావేవంలో ఇది మరో సారి రుజువైంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హాజరైన చంద్రబాబుకు కేంద్రం ఘన స్వాగతం పలికింది. కేంద్ర మంత్రి స్వయంగా చంద్రబాబును వేదిక వద్దకు తోడ్కోని పోయారు.

ఈ సమావేశానికి ఏపీ సీఎం సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినాయకులు హాజరయ్యారు. వారెవరికీ లేని గుర్తింపు, ప్రాధాన్యత చంద్రబాబుకు దక్కింది. సదస్సు అనంతరం ప్రధాని మోడీ చంద్రబాబుతో ప్రత్యేకంగా పది నిముషాల పాటు ముచ్చటించారు. ఈ మాటామంతీలో మోడీ రాజకీయ అంశాలతో పాటు, చంద్రబాబు ఆరోగ్యం, కుటుంబ సభ్యుల క్షేమ సమాచారం ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు బాగా చిక్కిపోయారు అని మోడీ వ్యాఖ్యానించారు.

అంతకు ముందు సమావేశానికి హాజరైన చంద్రబాబుకు కేంద్ర మంత్రులు స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ అయితే స్వయంగా దగ్గరుండి మరీ సమావేశ మందిరానికీ, వేదికపైకి తోడ్కొని పోయారు. ఈ సమావేశంలో చంద్రబాబు డిజిటల్ నాలెడ్జ్ పై ప్రసంగించారు. ఆయన ప్రసంగానికి సదస్సుకు హాజరైన  వారంతా ముగ్ధులయ్యారు. మోడీ అయితే ఫిదా అయిపోయారు. తన ప్రసంగంలో చంద్రబాబు సూచించిన డిజిటల్ నాలెడ్జ్ పై ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

చంద్రబాబు తన ప్రసంగంలో దేశం భవిష్యత్ గమనం ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అన్నవిషయాన్ని విపులంగా వివరించారు. వచ్చే పాతికేళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకోవాలని చెప్పారు. రానున్న పాతికేళ్లలో భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా నిలుస్తుందని అన్నారు. అందుకు అవసరమైన ప్రణాళికలను, కార్యాచరణను సిద్ధం చేసుకోవలసిన ఆవశ్యకతను వివరించారు. జి-20 సదస్సు సన్నాహకంపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సదస్సులో చంద్రబాబు ప్రసంగమే హైలైట్ గా నిలిచిందంటే.. ఆయన విజనరీని అవగాహన చేసుకోవచ్చు. చంద్రబాబు తన ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలను మోడీ తన ప్రసంగంలో ప్రత్యేకంగా పేర్కొని మరీ ప్రస్తుతించారంటేనే.. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రగతి, పురోగతి, అభివృద్ధి అంశాలపై చంద్రబాబు దార్శనికతకు ఎవరైనా సరే ఫిదా అవుతారనడానికి ఇదే ప్రత్యక్ష తార్కాణంగా చెప్పాలి.

తన ప్రసంగంలో చంద్రబాబు ఏపీకి సంబంధించిన అంశాలతో పాటుగా జాతీయ, అంతర్జాతీయ అంశాలనూ స్పృసించారు. దేశ ప్రగతి బాటలో నడవాలంటే చేపట్టాల్సిన చర్యల గురించీ ప్రస్తావించారు. ముఖ్యంగా దేశానికి బలం యువత అనీ, ఆ యువశక్తిని సద్వినియోగం చేసుకోవాలనీ చెప్పారు. అందుకోసం వారికి అవకాశాలు  సృష్టించేలా ప్రభుత్వాలు విధానాల రూపకల్పన చేయాలన్నారు.
ముందు నుంచీ అంటే చంద్రబాబు జి-20 సన్నాహక సదస్సుకు కేంద్రం  ఆహ్వానం మేరకు హస్తిన వెళుతున్నరని తెలిసినప్పటి నుంచీ అందరి ఆసక్తీ మోడీతో భేటీ ఉంటుందా అన్న అంశంపైనే కేంద్రీకృతమైంది. నాలుగు నెలల కిందట..  ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌  సమావేశంలో  కేంద్రం ఆహ్వానం మేరకు చంద్రబాబు   పాల్గొన్నారు. ఆ సమావేశం ముగిసిన అనంతరం... చంద్రబాబుతో మోదీ  కొద్ది సేపు ప్రత్యేకంగా మాట్లాడారు. ఓ ఐదు నిముషాల సేపు వీరిరువురూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా  మోడీ ‘మనం చాలా రోజులు అయ్యింది కలుసుకొని. మీరు ఢిల్లీకి తరచూ ఎందుకు రావడం లేదు? అని అడిగారు. మీతో చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది అని కూడా అన్నారు.

ఆ తరువాత నాలుగు నెలల అనంతరం మళ్లీ మోడీ, చంద్రబాబు ముఖాముఖీ కలుసుకోనుండటం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే సోమవారం(డిసెంబర్ 5) నాటి సదస్సులో చంద్రబాబు, ప్రధాని మోడీ ప్రత్యేకంగా భేటీ అవుతారా, అయితే ఇరువురి మధ్యా చర్చకు వచ్చే అంశాలేమిటి? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. వీరి ప్రత్యేక భేటీ ఏపీ రాజకీయాలలో మార్పులకు నాందిగా అందరూ   అభివర్ణిస్తున్నారు.