సబిత భానులపై సీబీఐ ముందు శ్రీలక్ష్మి గోడు
posted on Nov 21, 2011 11:04AM
హైదరాబాద్: గాలి జనార్దనరెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) ఫైళ్లు వేగంగా క్లియర్ చేయాలని అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎం కార్యాలయ అధికారి భాను నాపై విపరీతమైన ఒత్తిడి తెచ్చారని ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ట్విస్ట్ ఇచ్చారు. ఇందులో నాకేమీ తెలియదని సీబీఐ అధికారుల ముందు ఆమె తన గోడు వెళ్లబోసుకున్నారు. శనివారం రెండు విడతల్లో ఆమెను ప్రశ్నించినప్పుడు తన ఆవేదన వెళ్లగక్కారు. దీనిపై సీబీఐ అధికారులు భానును ఆదివారం ప్రశ్నించారు. సీబీఐ అధికారుల ప్రశ్నలకు సమాధానమిస్తూ అంతా ఆమే చేసిందని భాను చెప్పారు. తానెప్పుడూ గనుల సబ్జెక్ట్ చూడలేదన్నారు. గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్ తనకు తెలియదని భాను చెప్పినట్లు తెలిసింది. అధికారులంతా ఓఎంసీ కేసులో తన వైపే వేలెత్తి చూపుతుండటంతో శ్రీలక్ష్మి చక్రబంధంలో చిక్కుకున్నట్లయింది. కాగా.. తాజా పరిణామాల నేపథ్యంలో తీవ్రంగా కలత చెందిన శ్రీలక్ష్మి, తన సెలవును మరోసారి పొడిగించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
కాగా, శ్రీలక్ష్మి ఇప్పుడు దేవాలయాల చుట్టూ తిరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి వరకు హైదరాబాద్‌లో సీబీఐ విచారణ ఎదుర్కొన్న ఆమె ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ప్రత్యక్షమయ్యారు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో కుటుంబ సమేతంగా ప్రత్యక్ష నారాయణుడిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ప్రత్యేక పూజలను నిర్వహించి చిన్న ధ్వజస్తంభం ముందు వారిని ఆశీర్వదించారు. శ్రీలక్ష్మి రాకను జిల్లా అధికారవర్గాలు అత్యంత గోప్యంగా వుంచాయి. అరసవల్లి నుంచి శ్రీకూర్మం వెళ్లి శ్రీకూర్మనాధున్ని దర్శించుకున్నారు.