ఎకో ఫ్రెండ్లీ గణపతితో ఫ్రెండ్షిప్ చేద్దాం!!

ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో  భారతదేశం రెండవ స్థానంలో ఉంది. మనదేశం సర్వమతాలకు నిలయం. ఇలాంటి దేశంలో ఒకోప్రాంతంలో ఒకో రకమైన పండుగలు జరుపుకుంటారు. కానీ దేశం యావత్తు జరుపుకునే పండుగలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో వినాయక చవితి కూడా ఒకటి.  మహారాష్ట్ర, ముంబై ప్రాంతాల్లో దుర్గ నవరాత్రుల కంటే గొప్పగా వినాయక నవరాత్రులు జరుపుకుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా వినాయకుణ్ణి తొమ్మిదిరోజుల పాటు అలంకారాల మధ్య, పూజలతో ముంచెత్తుతారు. 

అయితే ఏ మతంలో అయినా, సంప్రదాయం అయినా, పండుగ అయినా అది ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా ఏర్పాటు చేశారు పెద్దలు. కానీ ప్రకృతి కాస్త వికృతి అయినట్టు నేటి మన తరాల పండుగలు అన్ని పర్యావరణానికి శత్రువులుగా మారి కూర్చున్నాయి.

సమస్య ఎక్కడుంది??

సమస్య మొత్తం మనుషులు చేస్తున్న అతిలోనే ఉంది. ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసుకున్న పండుగను అత్యుత్సాహంతో రానురాను సాంప్రదయాన్నే వేలెత్తి చూపే విధంగా తయారు చేసుకుంటున్నారు. 

అసలు ఏది సాంప్రదాయం??

సంప్రదాయం అంటే మతాన్నో, కులాన్నో సపోర్ట్ చేసేది అంటే అసలు ఆమోదించకూడదు. సంప్రదాయం అంటే జీవితాన్ని, మన పర్యావరణాన్ని, ముఖ్యంగా ప్రకృతిని కాపాడుకునేదిగా ఉండాలి. చాలామంది పండుగ పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నారని అంటుంటారు, అసలు పండుగే తప్పని, పండుగ మూర్ఖత్వమని అంటుంటారు. అయితే ఈ పండుగలు అన్ని ఏర్పాటయిన కాలంలో ఇప్పటిలా వీధి వీధికి ఒక పది అడుగుల విగ్రహం, ఊరు ఊరుకు యాభై అడుగుల విగ్రహం, రాష్ట్రానికొక వంద అడుగుల విగ్రహం లాంటివి లేవు. అప్పుడంతా స్వచ్ఛమైన బంకమన్ను చెరువు ప్రాంతాల నుండి తెచ్చి సొంతంగా వినాయకుని విగ్రహాలు చేసి, పూజ చేసుకుని తిరిగి ఆ  మట్టి గణపతిని చేరువుల్లోనే నిమజ్జనం చేసేవారు. కానీ ఇప్పుడు అలా ఎక్కడుంది?? ఎక్కడ చూసినా రసాయనాలతో చేసిన పెద్ద పెద్ద వినాయక విగ్రహాలు, వాటికి రసాయనాల పూతల రంగులు, అవి కూడా పూర్తిగా భక్తితో కాదు ఈ వీధికి, పక్క వీధికి మధ్య పోటీగా పెడుతున్నారు. అవన్నీ తీసుకెళ్లి చెరువుల్లో నిమజ్జనం చేస్తే ఏర్పడేది కాలుష్యమే. 

మరేం చేయాలి?? 

వినాయక పూజలో ఉపయోగించే పత్రి ఎంతో శక్తివంతమైనది. ఆషాఢమాసం ముగిసి శ్రావణం  మొదలవ్వగానే వర్షాలు కూడా ప్రారంభం అవుతాయి. ఆ వర్షాల వల్ల జరిగే నీటి కాలుష్యాన్ని అరికట్టడానికి ఈ వినాయక పూజలో ఉపయోగించే పత్రి ఎంతగానో దోహదపడుతుంది. నీటిని శుద్ధి చేసే ఔషధ గుణం పత్రిలో ఉంటుంది. కానీ ప్రస్తుతం పెద్ద వినాయక విగ్రహాల వల్ల కలుషితం బాగా పెరిగిపోతోంది. పైగా ఫ్యాక్టరీలు  విడుదల చేసే రసాయనాలు కూడా కలుషితనికి దోహాధం చేస్తాయి. 

ఇప్పుడందరూ చేయాల్సింది ఒకటే. వీలైనంతలో ప్రకృతి సహజంగా సొంతంగా మట్టి వినాయకుణ్ణి తయారు చేసుకోవడం. గొప్పలు పోకుండా పెద్ద వినాయకుళ్లను తగ్గించడం. దీనివల్ల ఎవరికి వారు ప్రకృతిని కాపాడుకున్నట్టు ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ నిర్వర్తించాల్సిన కర్తవ్యం కూడా. 

ప్రస్తుతం ప్రకృతి మరియు పర్యావరణ స్పృహ పెరిగి చాలామంది ఎకో ఫ్రెండ్లీ గణపతి వైపు మొగ్గు చూపుతున్నారు. 

ఒకవేళ మీరు బయట నుండి కృత్రిమ రసాయనాలు వాడిన వినాయకుణ్ణి తీసుకురావాలి అనుకునేముందు  ఒక్కసారి ప్రకృతి గురించి ఆలోచించి ప్రకృతికి మేలు చేసే మార్గాలలో పండుగ చేసుకునేవైపు ఆలోచించండి. 

వినాయకుడికి, ప్రకృతికి మధ్య ఉన్న అవినాభావసంబందం చాలా గొప్పది సుమా!! అందుకే మరి ఎకో ఫ్రెండ్లీ గణపతితో ఫ్రెండ్షిప్ చేద్దాం.

అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.

◆ వెంకటేష్ పువ్వాడ