వ్యక్తిత్వ పరిమళాన్ని ఇట్టే పట్టేయొచ్చు

ఎదుటివారు వాడే పెర్‌ఫ్యూమ్‌ని బట్టి వారి మనస్తత్వాన్ని అంచనా వేయొచ్చట. నమ్మబుద్ధి కావడం లేదు కదూ.. కానీ ఇది నిజం. కొంతమంది మనస్తత్వ శాస్త్రవేత్తలు అనేకమంది మీద పరిశోధనలు జరిపి నిర్ధారించిన నిజం. జాజి, మల్లె, విరజాజి, సంపంగి, చంపక, పున్నాగ, గులాబీ, చేమంతి... ఇలా పువ్వుల పరిమళాలను కోరుకునేవారి లక్ష్యాలు సమున్నతంగా వుంటాయట. ఎప్పుడూ చక్కగా తయారవడాన్ని కూడా ఇష్టపడతారట కూడా. నిండైన ఆత్మవిశ్వాసం వీరి స్వంతంట. వీరికి ఎదురుపడ్డ ఏ అవకాశాన్నీ అంత తేలికగా చేయిదాటి పోనివ్వరు కూడా.


పళ్ళ పరిమళాన్ని ఇష్టపడేవారు...

ఇక నిమ్మ, నారింజ, ద్రాక్ష, స్ట్రాబెర్రీలు తినడానికి చాలా బాగుంటాయి కదా! ఇవి తినడానికి ఎంత బాగుంటాయో వాటి పరిమళాలు కూడా అంతే అద్భుతంగా వుంటాయి. మరి ఈ పరిమళాలని ఇష్టపడేవారు సాధారణంగా ఏ పనినైనా శ్రద్ధగా, ఇష్టంగా చేస్తారుట. ఎప్పుడూ ఆడుతూ, పాడుతూ ఉంటారు. అయితే కాస్త దురుసుగా మాట్లాడటం, తనకి నచ్చకపోతే నిక్కచ్చిగా చెప్పటం కూడా చేస్తారుట.
 

ఆకుల పరిమళాన్ని ప్రేమించేవారు..

యూకలిప్టస్, తేజ్ పత్తా, సబ్జా ఆకుల వంటివాటి సువాసనలంటే మక్కువ చూపేవారు చాలా చురుగ్గా వుంటారని అంటున్నారు నిపుణులు. వీరు సదా అప్రమత్తంగా కూడా వుంటారట. అలాగే చాలా విషయాలు తెలుసుకోవాలని కూడా వీరు ఆరాటపడుతూ వుంటారట. సృజనాత్మకత పాళ్ళూ వీరిలో ఎక్కువే. కానీ ఒక్కోసారి చప్పున మూడీగా మారిపోతుంటారుట.

 

వీరి వ్యక్తిత్వమే వేరు...

వట్టివేరు, అల్లం, పసుపు వంటి వేర్ల సువాసనలను అధికంగా ఇష్టపడేవారు సౌమ్యంగా, నిరాడంబరంగా వుంటారుట. వీరి మనసులో మాట కనిపెట్టడం కష్టమే. వీరు చెప్పేదాకా వీరి ఇష్టాలేంటో కూడా అంచనా వేయలేంట. సో... ఈ సువాసనలని ఇష్టపడేవారు మీ ఫ్రెండ్స్‌లోనో, కావలసిన వారిలోనో వుంటే కొంచెం సునిశితంగా వారిని గమనించి వారి ఇష్టాలని తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

 

వీరి వ్యక్తిత్వమూ సుగంధమే...

మంచి గంధం, రోజ్ వుడ్, రైన్ చెట్ల బెరళ్ళ వాసనలు చాలా విలక్షణంగా వుంటాయి కదా. వీటిని ఇష్టపడే వారు కూడా విలక్షణ వ్యక్తులే. ఎందరిలో వున్నా ఇట్టే పసిగట్టవచ్చు వారిని. ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ వుంటారు. ఇలా ఆయా పరిమళాల ఎంపికను బట్టి సదరు వ్యక్తుల మనస్తత్వాన్ని అంచనా వేయచ్చు అంటున్నారు ఈ అంశంపై అధ్యయనం చేసిన వ్యక్తులు. మీ సన్నిహితులను కలసినప్పుడు సరదాగా ప్రయత్నించి చూడండి.