మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యను కబళించిన కరోనా..

తెలంగాణలో ఎందరో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వారి కుటుంబ సభ్యులు కరోనా బారినపడి చికిత్స పొంది క్షేమంగా బయటపడుతున్న సంగతి తెలిసిందే. ఐతే తాజాగా భద్రాచలం నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి... ప్రజలకు సేవలు అందించిన కమ్యూనిస్ట్ నేత మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనా వైరస్ సోకడంతో కన్నుమూశారు. గత 10 రోజులుగా జ్వరంతో బాధపడుతూ స్వగ్రామమైన సున్నంవారిగూడెంలో చికిత్స తీసుకున్నా కోలుకోక పోవడంతో కుటుంబ సభ్యులు ఆయనకు కరోనా టెస్ట్ చేయించగా పాజిటివ్ అని తేలడంతో వెంటనే విజయవాడ లోని ఒక ప్రయివేట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అయన కన్నుమూసారు. తమలో ఒకడిగా ఉంటూ సేవలందించిన తమ నాయకుడు కన్ను మూయడంతో ఆదివాసీలు తల్లడిల్లుతున్నారు. అందర్నీ చాలా ఆప్యాయంగా పలకరించి, చాలా నిరాడంబరంగా జీవించే ఆయనను చివరికి ఇలా కరోనా బలి తీసుకుంటుందని ఊహించలేదని వారంతా కన్నీరు మున్నీరవుతున్నారు.

భద్రాచలం నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1999, 2004, 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాజయ్య.. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రంపచోడవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎప్పుడూ ప్రజల నేతగా.. ప్రజలతోనే ఉంటూ వచ్చిన అయన ముఖ్యంగా ఆదివాసీల తరపున చాల పోరాటాలు చేశారు. ఎక్కడ గిరిజనులకు అన్యాయం జరుగుతున్నా రాజయ్య ముందు నిలిచి పోరాడారు. మరి కొద్ది సేపట్లో అయన స్వగ్రామం సున్నంవారిగూడెంలో రాజయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.