మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడి అరెస్టు

మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్ ను పోలీసులు మధురైలో అరెస్టు చేశారు. దళిత యువకుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న పినిపే శ్రీకాంత్ గత కొంత కాలంగా పరారీలో ఉన్నాడు. ఆయనను పోలీసులు మధురైలో గుర్తించి అరెస్టు చేశారు. దళిత యువకుడి హత్య కేసు వివరాలు ఇలా ఉన్నాయి.  

కోనసీమ జిల్లా అయినవిల్లికి చెందిన దళిత యువకుడు జనుపల్లి దుర్గాప్రసాద్ అయినవిల్లి గ్రామంలో వాలంటీర్ గా పని చేసేవాడు. మాజీమంత్రి పినిపే విశ్వరూప్ కు అనుచరుడు. అదే క్రమంలో పినిపే శ్రీకాంత్ కు సన్నిహితుడిగా మారాడు. ఇటీవలి ఎన్నికలలో పి. గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పినిపే శ్రీకాంత్ ప్రయత్నాలు చేశారు.

ఆ క్రమంలో పినిపే శ్రీకాంత్ కు అన్ని విధాలుగా జనుపల్లి దుర్గాప్రసాద్ సహాయ సహకారాలు అందించారు.  కాగా ఆ క్రమంలో కోనసీమకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయడంపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అయ్యింది. అప్పట్లో ఆ ఆందోళన హింసాకాండకు దారి తీసింది. ప్రధానంగా కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు హింసాకాండ చెలరేగింది. ఆ అల్లర్లలో పినిపే విశ్వరూప్ ఇంటిని ఆందోళన కారులు ధ్వంసం చేశారు. ఆ సమయంలో దాదాపు నెల రోజుల పాటు అమలాపురం వ్యాప్తంగా ఆంక్షలు అమలులో ఉన్నాయి. కర్ఫ్యూ కూడా విధించారు.

ఆ సమయంలోనే అంటే 2022 జూన్ 6న జనుపల్లి దుర్గాప్రసాద్ అదృశ్యమయ్యారు. అతడి మృతదేహం అదే  నెల 10 ముక్తేశ్వరం రేవు వద్ద అభించింది. అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లతో దర్యాప్తును సాగించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటికి పినిపే విశ్వరూప్ మంత్రిగా కూడా ఉండటంతో ఈ కేసును పోలీసులు నీరుగార్చారన్న విమర్శలూ వెల్లువెత్తాయి. 

ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. విచారణలో భాగంగా మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడి ప్రమేయం ఉందని వెల్లడి కావడంతో పోలీసులు పినిపే శ్రీకాంత్ ను ఈ కేసులో ఏ1గా చేర్చారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన ధర్మేష్ అనే యువకుడు విచారణఏలో పినిపే శ్రీకాంత్ ఆదేశాల మేరకు జనుపల్లి దుర్గా ప్రసాద్ హత్య జరిగిందని వెల్లడి కావడంతో శ్రీకాంత్ కోసం గాలింపు చేపట్టారు.  పరారీలో ఉన్న శ్రీకాంత్ మధురైలో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు.