గేట్రర్‌పై బీజేపీ గురి.. చంద్రబాబు, అమిత్‌షా భేటీలో చర్చ!
posted on Oct 21, 2024 6:34AM
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరింత బలపడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో బీజేపీకి స్థానాలు దక్కకపోయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో మంచి ఫలితాలనే రాబట్టింది. ఎనిమిది నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో.. తెలంగాణలో బలమైన పార్టీగా ఎదుగుతున్నట్లు బీజేపీ చాటింది. తాజాగా కాంగ్రెస్ పార్టీపై బీజేపీ దూకుడుగా ముందుకెళ్తున్నది. ప్రధాన ప్రతిపక్షం తరహాలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ అధికార పార్టీకి సవాళ్లు విసురుతోంది. ఈ క్రమంలోనే గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ గురి పెట్టింది. వచ్చే ఏడాది జరిగే గ్రేటర్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని ఆ పార్టీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీలో ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉన్నాయి. తెలంగాణలోనూ తెలుగుదేశం, జనసేన పార్టీలను కలుపుకొని గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం లాంటి బలమైన పార్టీ అండదండలు ఉంటే గ్రేటర్‌లో విజయం నల్లేరుపై బండి నడకే అవుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గత పదేళ్లుగా గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ హవా కొనసాగుతూ వచ్చింది. రాజకీయంగా బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఏ గేమ్ ఆడితే అదే హైదరాబాద్ లో కీలకంగా మారేది. కానీ, ఇప్పుడు కథ మారింది. బీఆర్ఎస్ క్రమంగా తన ప్రాబల్యాన్ని కోల్పోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో గ్రేటర్ లోని పలువురు నేతలు పార్టీని వీడారు. గ్రేటర్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మరోసారి నిలబెట్టుకోలేక పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రేటర్ పై ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో బీఆర్ఎస్ కి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్ సహా పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. దీంతో గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది. గ్రేటర్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ లోని కీలక నేతలు ఆ పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీంతో ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినపడుతోంది. మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ, హైడ్రా పేరుతో హడలెత్తిస్తోంది. ముఖ్యంగా నగరంలో చెరువులు, నాళాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. ఈ పరిణామం నగర వాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. మరో ఏడాదిలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు, మూసీ సుందరీకరణకు ఎందుకు ప్రాధాన్యతనిస్తున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. గ్రేటర్ పరిధిలోని పలువురు కాంగ్రెస్ నేతలు సైతం ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. మరో వైపు ప్రభుత్వ తీరుపై గ్రేటర్ వాసుల్లోనూ వ్యతిరేకత పెరుగుతోంది. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటున్నది.
గ్రేటర్ పరిధిలో ఎక్కువగా సెటిలర్స్ ఉన్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు ఎన్నోఏళ్లుగా హైదరాబాద్ నగరంలో స్థిరపడిపోయారు. వీరంతా ఎక్కువ శాతం తెలుగుదేశం మద్దతుదారులు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పెదగా క్రీయాశీలంగా లేకపోవటంతో గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం శ్రేణులు, సానుభూతిపరులు బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు.ఇప్పుడు గ్రేటర్ పరిధిలోని తెలుగుదేశం సానుభూతిపరులను తమవైపుకు తిప్పుకొనేలా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
వచ్చే ఏడాది జరిగే గ్రేటర్ ఎన్నికల్లోనూ మూడు పార్టీలూ కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని బీజేపీ పెద్దలు టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా.. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పోటీకి దూరంగా ఉంది. బీజేపీతో పొత్తు ఉంటుందని, ఖమ్మం, హైదరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ తోపాటు పలు జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. కానీ, తెలంగాణ బీజేపీలోని కొందరు నేతలు తెలుగుదేశంతో పొత్తుకు అభ్యంతరం చెప్పడంతో బీజేపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లింది. తెలుగుదేశం పోటీకి దూరంగా ఉంది. దీంతో తెలుగుదేశం సానుభూతిపరులు అధికశాతం మంది రేవంత్ రెడ్డి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు.
మరో ఏడాది తరువాత జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లోనూ టీడీపీ పోటీలో లేకుంటే ఆ పార్టీ మద్దతుదారులు కాంగ్రెస్ కే మద్దతుగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పుచేయకుండా, తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తేనే బాగుంటుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. తెలుగుదేశంతోపాటు జనసేనని కూడా కలుపుకొని గ్రేటర్ ఎన్నికలకు వెళితే మేయర్ పీఠాన్ని దక్కించుకోవటం సాధ్యమవుతుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే, ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండటంతో ఆ సమయానికి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారుతోయో వేచి చూడాల్సిందే.