అధిక కొలెస్ట్రాల్ సమస్యతో  ఇబ్బంది పడుతున్నారా? ఇవి తింటే కంట్రోల్ చేయచ్చు..!

చలికాలంలో గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. సరైన ఆహారం,  శారీరక శ్రమ లేకపోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.  ఇది ధమనుల పనితీరును దెబ్బతీస్తుంది.  అందువల్ల కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  అయితే అన్ని రకాల కొలెస్ట్రాల్ హానికరం కాదు. సాధారణంగా  కొలెస్ట్రాల్ గుండెకు కూడా మేలు చేస్తుంది, దీనిని  మంచి కొలెస్ట్రాల్ అని పిలుస్తారు . అసలు కొలెస్ట్రాల్ అంటే ఏమిటి?  ఆహారం ద్వారా చెడు కొలెస్ట్రాల్ స్థాయిని ఎలా తగ్గించవచ్చు? తెలుసుకుంటే..

కొలెస్ట్రాల్ ఎందుకు ముఖ్యం?

శరీరంలో కణ త్వచం, కణాల బయటి పొరను తయారు చేయడానికి కొలెస్ట్రాల్ అవసరం. ఇది కణంలోనికి,  బయటికి వెళ్లే వాటిని నియంత్రిస్తుంది. అంతే కాకుండా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాలేయం పిత్త రసాన్ని ఉత్పత్తి చేస్తుంది.  ఇది జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈస్ట్రోజెన్,  టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్లు శరరంలో తయారు కావడానికి కూడా కొలెస్ట్రాల్ అవసరం. ఈ కారణాల వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ చాలా అవసరమవుతుంది. కానీ  శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే మాత్రం అది హానికరంగా పేర్కొంటారు.

చెడు కొలెస్ట్రాల్  ఎలా తగ్గించాలి?

చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడానికి అతి పెద్ద కారణం ఆహారం. అనారోగ్యకర ఆహారం తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన గుండె సంబంధిత వ్యాధులు సులువుగా వస్తాయి. చెడు కొలెస్ట్రాల్  తగ్గించడానికి ఆహారంలో కొన్ని  మార్పులు చేయడం అవసరం. ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు దీనికి ప్రత్యేకంగా సహాయపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడే ఫైబర్ రిచ్ ఫుడ్ ఐటమ్స్ గురించి  తెలుసుకుంటే..

గింజలు లేదా నట్స్..

బాదం , వాల్‌నట్స్ వంటి నట్స్ గుండెకు చాలా మేలు చేస్తాయి. అసంతృప్త కొవ్వులతో పాటు, కరిగే ఫైబర్ కూడా వీటిలో ఉంటుంది, ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి  మితంగా మాత్రమే తినాలి.

వోట్మీల్..

వోట్మీల్‌లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల దీన్ని  ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

అవకాడో,,

కరిగే ఫైబర్‌తో పాటు, అవకాడోలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా సహాయపడతాయి.

బెర్రీస్..

బెర్రీస్‌లో ఫైబర్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ముఖ్యమైనవి.

ఆపిల్..

యాపిల్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అందువల్ల దీన్ని ఖచ్చితంగా  ఆహారంలో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

                                     *నిశ్శబ్ద.