బెంగళూరులో ఫ్లయింగ్ టాక్సీలు!
posted on Oct 15, 2024 4:05PM
బెంగళూరు నగరంలో ట్రాఫిక్‌కి మరోపేరు నరకం. ఆ నరకాన్నుంచి బెంగళూరు నగరాన్ని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫ్లయింగ్ టాక్సీల సదుపాయాన్ని ఆస్వాదించడానికి బెంగళూరు నగరం సిద్ధమవుతోంది. ట్రాఫిక్ రద్దీ, వాతావరణ కాలుష్య ఇబ్బంది లేకుండా హాయిగా, తక్కువ ఎత్తులో ప్రయాణించే సదుపాయాన్ని కల్పించడానికి బెంగళూరు కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు రెడీ అవుతోంది. త్వరలోనే బెంగళూరు నగరానికి ఫ్లయింగ్ టాక్సీలను తీసుకువస్తున్నట్టు ప్రకటించింది. దీనికోసం సార్లా ఏవియేషన్ సంస్థలో ఒప్పందం కుదుర్చుకున్నట్టు బెంగళూరు ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి నగరంలోని వివిధ ప్రదేశాలకు హాయిగా గాలిలో ఎగురుతూ వెళ్ళిపోవచ్చు. ఈ విషయాన్ని సార్ల ఏవియేషన్ ప్రతినిధులు వివరిస్తూ, ‘‘బెంగళూరు విమానాశ్రయం నుంచి నగరంలోని ఇందిరా నగర్‌కి వెళ్ళాలంటే ఇప్పుడు ఒక గంట 50 నిమిషాలు పడుతోంది. అదే ఫ్లయింగ్ టాక్సీలు వచ్చిన తర్వాత ఆ సమయం 5 నిమిషాలకు తగ్గిపోతుంది. రవాణా వ్యవస్థలో ఇదొక గేమ్ ఛేంజర్. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రారంభ దశలో వుంది. ఈ ఫ్లయింగ్ టాక్సీలు అందుబాటులోకి రావడానికి ఇంకా రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుంది’’ అన్నారు.