ఫిలింనగర్‌లో భూగోల్‌మాల్... అక్బర్...

 

సొసైటీలకు భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ తెలంగాణ అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు. రూల్ 74 కింద భూముల కేటాయింపుపై నోటీసులు ఇచ్చిన అక్బరుద్దీన్ శాసనసభలో మాట్లాడారు. జూబిలీహిల్స్, నందగిరి సొసైటీ తదితర సంస్థలకు భూ కేటాయింపుల మీద సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. సొసైటీలకు భూ కేటాయింపుల్లో పెద్ద ఎత్తు అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఫిల్మ్‌నగర్ భూముల కేటాయింపుల్లోనూ అక్రమాలు జరిగాయని అన్నారు. గృహ నిర్మాణ సొసైటీలకు వక్ఫ్ భూములు కూడా కేటాయించారని ఆయన సభ దృష్టికి తెచ్చారు. 208 ఎకరాల భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా వున్న వక్ఫ్ భూములు కబ్జాలకు గురవుతున్నాయని, కొన్ని చోట్ల వక్ఫ్ భూములను ప్రభుత్వ భూములని అంటున్నారని వెల్లడించారు. పలు సొసైటీలకు భూముల కేటాయింపులపై ప్రభుత్వ వివరణ సక్రమంగా లేదని, ప్రభుత్వ ప్రకటనలోనూ సర్వే నంబర్లు ఇవ్వలేదని అన్నారు. ఫిల్మ్ నగర్ సొసైటీలో అక్రమాలు జరిగాయని విచారణ అధికారి చెప్పారని, ఆ నివేదికను ఎందుకు బహిర్గతం చేయలేదని అక్బరుద్దీన్ ప్రశ్నించారు.