రాములోరి కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు
posted on Apr 1, 2025 1:12PM
.webp)
భద్రాద్రి రామయ్యకు తలంబ్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్
దక్షిణ అయోధ్యగా భాసిల్లు తున్న భద్రాద్రి రాములోకి కల్యాణం కోసం ముస్తాబైంది. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రామాలయం, కల్యాణమండపం పరిసర ప్రాంతాలు చలువ పందిళ్లు చాందినీ వస్త్రాలతో అలంకరి స్తున్నారు. ఆలయానికి విద్యుద్దీపాలంకరణ చేపట్టడంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఏప్రిల్ 6 న సీతారాముల కల్యాణం,7 న రాములోరి పట్టాభిషేకం జరగనుంది. రాములోరికి తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సిఎం రాక సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల తిరు కల్యాణం, శ్రీరామ పునర్వసు దీక్ష ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 7న మహాపట్టాభిషేకం, 8న సదస్యం నిర్వహించనుండగా 12న చక్రతీర్థం, ద్వాదశ ప్రదక్షిణాలు, ద్వాదశ ఆరాధనలు, శ్రీపుష్ప యాగంతో ఉత్సవం సమాప్తి కానుంది. బ్రహ్మోత్సవాలను పుర స్కరించుకొని ఏప్రిల్ 12 వరకు ఆలయంలో నిత్య కల్యాణాలను నిలిపివేయనున్నారు.
భద్రాచలంలోని శ్రీసీతారామచం ద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులు మెచ్చే రీతిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవ స్థానం ఈవో ఎల్.రమాదేవి తెలిపారు.ఆలయ భద్రాచలం, పర్ణశాలల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. 6న శ్రీరామనవమికి, 7న శ్రీరామ మహాపట్టాభిషేకానికి కలెక్టరు జితేష్ పాటిల్ పర్యవేక్షణలో అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు రూ.2.50 కోట్లతో బడ్జెట్ రూపొందించారు. ఇందులో సుమారు రూ 1.50 కోట్లు ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో పనుల కోసం కేటాయించడం జరిగింది. మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపాన్ని 24 సెక్టార్లుగా విభజించగా అందులో 31వేల మంది ప్రత్యక్షంగా కల్యాణం తిలకించడానికి వీలుంది. ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక చొరవతో భక్తుల కోసం మిథిలా స్టేడియంలోని అన్ని సెక్టార్లలో పొగమంచు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా భక్తులకు వేడి నుంచి ఉపశమనం లభించనుంది...భక్తుల రద్దీ ఈసారి ఎక్కు వగా ఉంటుందని భావిస్తున్నారు..అందుకు గాను పటిష్ట సౌకర్యాలు, సదు పాయాలూ కల్పిస్తున్నారు.
కల్యాణ మండపంలో 50 టన్నుల ఏసీ, వంద కూలర్లు, 250 ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు . భద్రాచలం, పర్ణశాలల్లో నాలుగు లక్షల చదరపు అడుగుల్లో చలువ పందిళ్లను వేస్తున్నారు. సెక్టార్లలోని భక్తులకునేరుగా మజ్జిగ, తాగునీరు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసేస్తున్నారు..ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో వైద్యశాఖ సహకారంతో ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. నవమికి తరలివచ్చే భక్తుల కోసం 19 ప్రసాదాల కౌంటర్లు, 60 తలంబ్రాల పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నవమి అనంతరం కార్గో, పోస్టల్, ఆన్లైన్, ప్రచార శాఖల ద్వారా ముత్యాల తలంబ్రాలను పంపేందుకు చర్యలు చేపడుతున్నారు..అదేవిధంగా పరోక్ష సేవలు పొందేవారికి తలంబ్రాలను పంపనున్నారు.
ఈసారి నవమికి 200 క్వింటాల్ ముత్యాల తలంబ్రాలు , రెండు లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు . ఇందుకోసం 30 మంది సిబ్బంది తయారీలో నిమగ్నమయ్యారు. లడ్డూ తయారీ సమయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వ హించారు. పెద్ద లడ్డూలను 10 వేలు తయారు చేయ నున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరవాత ఇది రెండవ శ్రీరామ నవమి..గత ఏడాది లోక్ సభ ఎన్నికల కోడ్ కారణంగా సిఎం రేవంత్ రాలేదు..ఈసారి సీఎం ముత్యాల తలంబ్రాలు,పట్టు వస్త్రాలుసమర్పించనున్నారు. మంత్రులు ,ఎమ్మెల్యేలు ,అధికారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది..అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు..