ఖమ్మం కాంగ్రెస్ లో నైరాశ్యం
posted on Apr 1, 2025 1:57PM

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ నాయకుల్లో నైరాశ్యంలో ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా నామినేటెడ్ పదవుల పంపకం ఇంకా కొలిక్కి రాలేదు. తొలివిడతలో మాత్రం పాత కొత్త వారికి ఓ మూడు పదవులు ఇచ్చారు. తొలి నుంచి కాంగ్రెస్ లో ఉన్న పొదెం వీరయ్య, రాయల నాగేశ్వర రావులకు, ఎన్నికల ముందు పార్టీలో చేరిన మువ్వా విజయబాబు కు పదవులు దక్కాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నో కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. అయినా ముగ్గురు మంత్రుల మధ్యా సఖ్యతా లోపం కారణంగా అధిష్ఠానానికి జాబితాలు పంపడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో కార్యకర్తలు నష్టపోతున్నారు.
భద్రాచలం దేవస్థానానికి చైర్మన్ ను నియమించలేదు. గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, వక్ఫ్ బోర్డు చైర్మన్లు ఖాళీగానే ఉన్నాయి. పదేళ్లు అధికారం లేకపోయినా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు పదవుల విషయంలో జరుగుతున్న తీవ్ర జాప్యంతో తీవ్ర నిరాశకు గురౌతున్నారు. బీఆర్ఎస్ పాలనలో పోరాటాలు చేసి కేసులు ఎదుర్కొంటున్న తమను పార్టీ పట్టించుకోలేదని ఆవేదన చెందు తున్నారు. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారి పెత్తనమే నడుస్తోందన్న విమర్శలు కూడా ఎక్కు వగా వినిపిస్తున్నాయి. పొంగులేటి మాత్రం తన మద్దతుదారుడు విజయ్ బాబు కు పదవి ఇప్పించు కున్నారు. తుమ్మల నాగేశ్వరావు తొలివిడతలో పాత కాంగ్రెస్ వాళ్లకే పదవులని తనతో వచ్చిన అనుచరులకు స్పష్టం చేశారు. ఇక ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి బిజీగా ఉంటున్నారు. కార్యకర్తలలో నైరాశ్యం పేరుకుపోతున్నది.