సైలెన్స్ తెలంగాణ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ప్రచార ఘట్టం మంగళవారం (నవంబర్28) సాయంత్రంలో ముగిసింది.  ఇలా ప్రచార గడువు ముగియడంతోనే రాష్ట్రంలో  144 సెక్షన్‌ అమలులోకి వచ్చింది.  ప్రచార గడువు ముగిసింది కనుక స్థానికేతరులు నియోజకవర్గాలు విడిచి వెళ్లాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.   పోలింగ్ ఈ నెల 30న జరగనున్న సంగతి విదితమే. దీంతో ఎన్నికల సంఘం నిబంధనల్లో భాగంగా 24 గంటల ముందే ప్రచారం ముగిసింది.  ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అక్టోబర్ 9వ తేదీ నుండి దాదాపు రెండు నెలల పాటు రాష్ట్రంలో రాజకీయ నేతలు ప్రచారం హోరెత్తించారు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు.

హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  నెల రోజులలో సగటున రోజుకు మూడు చొప్పున దాదాపు 95 బహిరంగ సభల్లో పాల్గొనగా.. గులాబీ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించారు. మరో పక్కా బీఆర్ఎస్‌ను గద్దె దింపడమే టార్గెట్‌గా పెట్టుకున్న కాంగ్రెస్ సైతం ప్రచారం హోరెత్తించింది. కర్నాటక ఎన్నికల ఫలితాల  తరువాత   గ్రాఫ్ అమాంతం పెరగడంతో.. తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు నూతనోత్సహంతో ప్రచారం నిర్వహించాయి.

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, ఖర్గే, డీకే, సిద్ధారామయ్య వంటి నేతలు తెలంగాణలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా జోరుగా ప్రచారం చేశారు. మరో పక్క బీజేపీ సైతం   పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.   ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా, యోగి సహా పలువురు బీజేపీ అగ్రనేతలు కీలక నేతలు తెలంగాణను చుట్టేశారు. మూడు పార్టీల నేతల ప్రచారంతో  హోరెత్తిన తెలంగాణ.మంగళవారం (నవంబర్ 28) సాయంత్రం నుండి మూగబోయింది. గురువారం (నవంబర్ 30) న పోలింగ్ జరగనుండగా.. ఆదివారం (డిసెంబర్ 3) ఓట్ల లెక్కింపు జరిగగి ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణ తీర్పు ఏ పార్టీకి అనుకూలం అన్నది ఆ రోజు తేలిపోనున్నది.