ఆర్ధికమంత్రిగా చేస్తే చట్టం నుండి మినహాయింపు ఇవ్వాలా?
posted on Dec 1, 2015 7:42PM
కేంద్ర ఆర్ధికమంత్రిగా అనేక ఏళ్ళపాటు పనిచేసిన చిదంబరంకి ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ మరియు ఆదాయపన్ను శాఖలు ఏవిధంగా పనిచేస్తాయో అందరికంటే బాగా తెలిసి ఉంటుంది. కానీ ఆయన తన కొడుకు కార్తి సంస్థలకు వాటి నుండి మినహాయింపు ఆశిస్తుండటం విశేషం. చెన్నైలో కార్తి, అతని స్నేహితుల సంస్థలపై ఇవ్వాళ్ళ ఆ రెండు శాఖల అధికారులు దాడులు చేసారు. వారు తన కొడుకు అతని స్నేహితుల సంస్థలపై దాడులు చేయడాన్ని పి.చిదంబరం తప్పుపట్టారు.
రాజకీయాలలో ఉన్న కారణంగా ఇటువంటి వేధింపులు ఎదుర్కోక తప్పదని మాకు తెలుసు. అందుకు మేము సిద్దంగానే ఉన్నాము. కానీ మా కుటుంబంతో పరిచయమున్న వాళ్ళని అందరినీ వేధించడం సరికాదు. ఆ సంస్థలన్నీ చట్టబద్దంగా వ్యాపారాలు నిర్వహించుకొంటూ, తమ రాబడిపై ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాయి. ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ లో పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారికి నేను ఆర్దికమంత్రిగా ఉన్నపుడు సహాయపడనందుకు, ఇప్పుడు ఆయన మాపై ఈవిధంగా వేధింపులకి పాల్పడుతున్నారు. కానీ నా కొడుకు కార్తి, అతని స్నేహితులు చట్టబద్దంగా వ్యాపారాలు చేసుకొంటునప్పుడు మేము ఎవరికీ భయపడనవసరం లేదు. కానీ వారిని వేధించే బదులు మోడీ ప్రభుత్వం నేరుగా నన్నే టార్గెట్ చేసుకొంటే ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నాను,” అని అన్నారు.
చిదంబరం చాలా చక్కగా వాదించారు. ఆయన వాదన ప్రకారం కేవలం తమను వేధించేందుకే మోడీ ప్రభుత్వం తమ సంస్థలపై దాడులు చేయిస్తోందని చాలా చక్కగా చెప్పారు. అందుకోసం ఆయన తను మాజీ ఆర్ధికమంత్రిననే విషయాన్ని చాలా తెలివిగా వాడుకొంటున్నట్లు అర్ధమవుతోంది. తను ఆర్ధికమంత్రి కనుక తన సంబంధీకుల సంస్థలలో ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ మరియు ఆదాయపన్ను శాఖ అధికారులు తణికీలు చేయరాదని, చేసినట్లయితే అది రాజకీయ వేధింపులేనని ఆయన సూత్రీకరిస్తున్నట్లుంది. అంటే చట్టం నుండి తమ సంస్థలకి పూర్తి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరుకొంటున్నట్లుంది.
ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ మరియు ఆదాయపన్ను శాఖ అధికారులు నిత్యం దేశంలో అనేక సంస్థలపై దాడులు చేస్తుంటారు. ఆ సంస్థలన్నీ కూడా ఇలాగే ఏదో ఒక రాజకీయ లింకు వెలికి తీసి వాదించడం మొదలుపెడితే అప్పుడు దేశంలో ఉండే అన్ని సంస్థలకి చట్టం నుండి మినహాయింపు ఇవ్వవలసి ఉంటుంది. తమ సంస్థలన్నీ చట్ట బద్దంగా వ్యాపారాలు చేస్తూ, రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తూ, సక్రమంగా పన్నులు చెల్లిస్తున్నాయని చిదంబరం, కార్తి ఇద్దరూ గట్టిగా వాదిస్తున్నారు. అటువంటప్పుడు ఇక ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ మరియు ఆదాయపన్ను శాఖ అధికారుల తణికీలకి, అడిగే ప్రశ్నలకి భయపడటం దేనికి? వాటిని వేధింపులని చెప్పుకోవడం దేనికి?
దేశ ఆర్ధిక మంత్రిగా చేసిన చిదంబరం వంటి వారు చట్టాలు తమకు వర్తింపజేయడం అంటే వేధింపులే అని వక్ర బాష్యం చెప్పడం చాలా శోచనీయం. ఒకప్పుడు తన హయంలో ఏవిధంగా ఆ రెండు సంస్థల అధికారులు పనిచేసారో ఆయనకి తెలుసు. వాళ్ళు ఇప్పుడు అలాగే తమ పని తాము చేసుకుపోతున్నారు. కనుక ఆయనే స్వయంగా అధికారులను స్వాగతించి ఉండి ఉంటే తమ సంస్థల నిజాయితీని నిరూపించుకొనే అవకాశం దక్కేది. ప్రజలు కూడా ఆయన నీతి నిజాయితీని హర్షించేవారు.