వికృత సంస్క్రతిని పోషిస్తే దానికి సమాజమే బలవక తప్పదు

 

సమాజం ఏదయినా వికృత విధానాలని లేదా ఆచారాలని లేదా పద్దతులనుఅవలంభించినా లేదా ప్రోత్సహించినా దాని దుష్పలితాలు అదే సమాజంపై ఎంత తీవ్రంగా ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవాలంటే నాటి సతీసహగమనం దురాచారాల నుండి నేటి ఐసిస్ ఉగ్రవాదులు...అమెరికాలో నెలకొని ఉన్న గన్ కల్చర్ వరకు అనేక సజీవ ఉదహారణలు కనబడుతున్నాయి. ఒక తప్పుచేయడం, దానినే సమాజ విధానంగా పాటించడం లేదా సమాజంపై బలవంతంగా రుద్దడం, అనేక కారణాల చేత ఆ తప్పులను సరిదిద్దలేని ప్రభుత్వాల బలహీనతల కారణంగా యావత్ ప్రపంచంలో ఏదో ఒక రూపంలో అశాంతి నెలకొని ఉండటం అందరూ గమనిస్తూనే ఉన్నారు.

 

అమెరికాలో “గన్ కల్చర్ సంస్కృతి” అని ఒబామా ప్రభుత్వం చట్ట సవరణల ద్వారా నిర్మూలించాలని ప్రయత్నించినపుడు దానికి చాలా వ్యతిరేకత ఎదురయింది. తత్ఫలితంగా అడపాదడపా అమెరికాలో విచ్చలవిడిగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అనేకమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. హార్వర్డ్ విశావిద్యాలయ విద్యార్ధులు చేసిన ఒక తాజా సర్వేలో అమెరికాలో సుమారు 34 శాతం మంది మారణాయుదాలను కలిగిఉన్నట్లు తెలిసింది. కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే ఇంతవరకు 355సార్లు కాల్పులు జరిగాయి. ఆ కాల్పులలో అనేక వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్న కాలిఫోర్నియాలోని సాన్ బెర్నార్డినో నగరంలో 14 మంది మరణించారు.

 

ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ లెక్కల ప్రకారం అమెరికాలో 18 నుండి 29 సం.ల వయసులోపు వారిలో 26 శాతం మంది వద్ద, 30-49 సం.ల వారిలో 32 శాతం, 50-64సం.ల వారిలో 40శాతం, 65 సం.ల పైబడి ఉన్నవారిలో 40 శాతం మంది తుపాకులు లేదా రివాల్వర్ లేదా ఏదో ఒక రకమయిన మారణాయుధాలు కలిగి ఉన్నారని చెపుతోంది. అంటే భారత్ లో ఇప్పుడు ప్రజలు సిమ్ కార్డులు ఏవిధంగా కొంటున్నారో అదే విధంగా అమెరికాలో ప్రజలు తుపాకులు కొనుకొంటున్నారన్నమాట.

 

అమెరికాలో నెలకొన్న ఈ గన్ సంస్కృతి ఏవిధంగా అక్కడి ప్రజలపై దుష్ప్రభావం చూపుతోందో అలాగే భారత్ లో నానాటికి పెరుగుతున్న “మొబైల్ సంస్కృతి” కూడా సమాజం మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్కడి విష సంస్కృతి వలన మనుషులు ప్రాణాలు కోల్పోతుంటే, భారత్ లో వ్యాపిస్తున్న ఈ విష సంస్కృతి సమాజంలో వికృత పరిణామాలకు దారి తీస్తోంది. ఈ వాదనను నేటి యువతరం అంగీకరించకపోవచ్చును. కానీ మొబైల్ కి ముందు మొబైల్ ప్రవేశం తరువాత భారత్ లో సామాజిక సమస్యలు, నేరాలను పోల్చి చూసినట్లయితే ఈ వాదనను అంగీకరించక తప్పదు.

 

ప్రస్తుతం ప్రపంచం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దానితో సమాంతరంగా రకరకాల విష సంస్కృతులు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. వాటినీ అభివృద్ధిలో భాగంగానే చూస్తున్నారు తప్ప వాటిలో తపొప్పుల గురించి ఎవరికీ ఆలోచించే తీరిక, ఆసక్తి లేకపోవడంతో సామాజిక సమస్యలు-అభివృద్ధి రెండూ చెట్టపట్టాలు వేసుకొని ముందుకు సాగిపోతున్నాయి. డిల్లీలో నిర్భయ ఉదంతం జరిగిన తరువాత కేంద్రప్రభుత్వం చట్టాన్ని మరింత కటినం చేసింది. మంచిదే. కానీ దాని వలన దేశంలో నేరాలు ఏమాత్రం తగ్గలేదు ఇంకా పెరిగిపోయాయి.

 

సమాజ ఆలోచనా విధానంలో మార్పులు రావాలంటే అది తల్లి ఒడిలో, బడిలో నుండే మొదలవ్వాలనే నిజాన్ని మన ప్రభుత్వాలు ఇంకా గుర్తించలేదు. మన దేశంలో ఇంతకు ముందు ఎన్నడూ కనీవినని ఇటువంటి ఘోర నేరాలు, వింత పోకడలు, విచిత్రమయిన ఆలోచనా విధానాలు, అలాగే అభివృద్ధి కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నాయి. మన ఆలోచనా విధానాలు అభివృద్ధికి, శాంతి సౌభాగ్యాలను కల్పిస్తే దానిని తప్పకుండా స్వాగతించవలసిందే. కానీ మన చిన్న జీవితాలని అవి అతలాకుతలం చేస్తున్నా కూడా మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మనుగడ సాగించవలసి రావడమే చాలా దురదృష్టకరం.