ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ?

ఆంధ్ర ప్రదేశ్ లో ఏం జరుగుతోంది ? ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉందా? ప్రజాస్వామ్యం ఉందా? లేక దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఎమర్జెన్సీ ఏమైనా అమలులో ఉందా? ఇక్కడ దేశంలో చట్టాలేవీ వర్తించవా? ఏపీని ఒక నియంత పాలిస్తున్నారా? అంటే పరిస్థితులను చూస్తుంటే ఔననే అనాల్సి వస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఎన్నికలకు నిండా రెండు నెలలు కూడా సమయం లేదు. ఈ తరుణంలో రాష్ట్రంలో ఓ విధమైన భయానక పరిస్థితులను రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం సృష్టించింది.

తన విధానాలకు, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడడానికి వీల్లేదు. పత్రికలు వార్తలు ప్రచురించడానికి వీల్లేదు. అసలు ప్రతిపక్షాలు రోడ్ల మీదకు రావడానికే వీల్లేదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఆ మేరకు అప్రకటిత ఆంక్షలు అమలులో ఉన్నాయా అన్నట్లుగా రాష్ట్రంలో భయానక పరిస్థితులను సృష్టించింది. మీడియా ప్రతినిథులపై దాడులు, పత్రికా కార్యాలయాలపై దాడులు, ఆందోళనకు దిగితే ప్రతిపక్షాల నేతల అరెస్టులు.. ఇదీ ఇప్పుడు ఏపీలో నెలకొన్న పరిస్థితి. జగన్ అధకారంలోకి వచ్చినప్పటి నుంచీ దాదాపు ఇవే పరిస్థితులు ఉన్నప్పటికీ ఎన్నికల ముంగిట ప్రభుత్వ దమనకాండ తీవ్రత పెరిగింది. తలెత్తితే సహించం అన్నట్లుగా జగన్ సర్కార్ వ్యవహరిస్తోంది.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏపీలో పరిస్థితులు అత్యయిక పరిస్థితిని గుర్తుకు తెస్తున్నాయి.   1975 జూన్ 25 అర్థరాత్రి  అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఇది జరిగి 49 ఏళ్లయ్యింది.  తన ఎన్నిక  చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో  అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, 1977 జూన్  25 అర్థరాత్రి దేశంలో ఎమర్జెన్సీ విధించారు. జూన్ 26 తెల్లవారే సరికి, ఇందిరమ్మ పోలీసులు, అప్పటికే ఇందిరా గాంధీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా, సంపూర్ణ క్రాంతి ఉద్యమం పేరిట దేశవ్యాప్త ఆందోళనకు  పిలుపు ఇచ్చిన సోషలిస్ట్ నేత  జయప్రకాశ్ నారాయణ సహా వందల సఖ్యలో  ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేశారు. 

 ఇప్పడు వైసీపీలో జగన్  అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా గళమెత్తిన, ఎత్తుతున్న వారిపై జగన్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అప్పట్లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించి నిర్బంధ కాండ సాగించారు. కానీ జగన్ అటువంటి ప్రకటన ఏదీ లేకుండానే అదే తరహా పాలన సాగిస్తున్నారు. నిర్బంధ కాండ సాగిస్తున్నారు.   మీడియా ప్రతినిథిపై దాడి, ఆ వెంటనే మరో మీడియా కార్యాలయంపై దాడి, ఇక ఆ మరుసటి రోజే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చలో సెక్రటేరియెట్ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడానికి వందల సంఖ్యలో పోలీసులను మోహరించడం, ఆ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం, గృహ నిర్బంధంలో ఉంచడం చూస్తుంటే నాటి ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులు గుర్తుకు వస్తున్నాయి.

పైన చెప్పిన వన్నీ నిన్నమొన్న నేడు జరిగిన సంఘటనలు. కానీ జగన్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ రాష్ట్రంలో ఇవే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రజా భవన్ కూల్చివేతతో మొదలైన విధ్వంసం నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ముంగిట  జగన్ రెడ్డి  ఓటమి భయంతో రాష్ట్రంలో అప్రకటిత  ఎమర్జెన్సీని అమలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.  నాడు ఇందిరాగాంధీకి ఎదురైన అనుభవమే వచ్చే ఎన్నికలలో జగన్ కూ ఎదురు కాక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.