ప్రధాని రేసులో ప్రియాంక వాద్రా ?.. అలా అయితేనే ఐక్యంగా ఇండియా కూటమి?

పీఎం ప్రియాంక..  ఇండియా కూటమి చీలికలు పేలికలు కాకుండా నివారించడానికి కాంగ్రెస్ తురఫు ముక్కలాంటి వ్యూహానికి తెరలేపిందా? రాహుల్ నేతృత్వంపై కొద్ది పాటి అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న కూటమి భాగస్వామ్య పక్షాలను మళ్లీ ఏకతాటిపైకి తీసుకురావాలంటే ప్రధాని పదవికి ప్రియాంక పేరును ప్రతిపాదించడమే మార్గమన్న భావనకు వచ్చిందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా అంటే 2019 ఎన్నికల కంటే ముందు నుంచీ కూడా కాంగ్రెస్ లోని ఒక బలమైన వర్గం ఈ డిమాండ్ చేస్తూనే ఉంది. అయితే హైకమాండ్ ఈ డిమాండ్ ను పెద్దగా ఖాతరు చేయలేదు. రాహుల్ గాంధీ నేతృత్వంలోనే కాంగ్రెస్ ముందుకు సాగుతుందన్న విధానానికే కట్టుబడి ఉంది. పైగా రాహుల్ ను ప్రధానిగా చేసి పార్టీ మాజీ అధినేత్రి సోనియాగాంధీ కలను సాకారం చేస్తామంటూ చెబుతూ వచ్చింది.

అయితే రాహుల్ గాంధీ రాజకీయ అపరిపక్వతను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ మిత్రపక్షాలు ఒక్కటొక్కటిగా బయటకు వెడుతూ వచ్చాయి. పైగా   2019 ఎన్నికలలోనూ కాంగ్రెస్ గ్రాఫ్ ఏమంత పెరగలేదు సరికదా మరింత దిగజారడంతో కాంగ్రెస్ పార్టీలో నిరాశా నిస్ఫృహలు నెలకొన్నాయి.  రాహుల్ గాంధీ నాయకత్వ పటిమపై పార్టీలోనే అనుమానాలు పొడసూపాయి. దీంతో 2019 ఎన్నికలలో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే రెండు వరుస ఓటముల తరువాత కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడానికి గట్టి ప్రయత్నమే చేసింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అన్ని వర్గాల నుంచీ మంచి స్పందన లభించింది. దీంతో 2024 ఎన్నికలపై కాంగ్రెస్ ఆశలు పెంచుకుంది. అయితే మోడీని, బీజేపీనీ ఢీ కొనాలంటే బీజేపీయేతర పార్టీలన్నీ సమష్టిగా కదలాలనీ, లేకుంటే పార్టీ పుంజుకున్నా.. అధికారం చేజిక్కించుకునే అవకాశాలు అంతంత మాత్రమేననీ కాంగ్రెస్ గ్రహించింది. అదే సమయంలో బీజేపీ యేతర పార్టీలను బలహీనం చేసి ఏకపార్టీ స్వామ్యం దిశగా భారత్ ను నడిపించాలన్న బీజేపీ ఉద్దేశాన్ని పసిగట్టిన బీజేపీ యేతర పార్టీలు మరీ ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, సమాజ్ వాదీ పార్టీ.. పలు ప్రాంతీయ పార్టీలూ కాంగ్రెస్ నేతృత్వంలో సమష్టిగా పని చేయడానికి స్థూలంగా ఒక అంగీకారానికి వచ్చాయి. కూటమికి కాంగ్రెస్ నేతృత్వంపై పెద్దగా అభ్యంతరాలు లేకపోయినప్పటికీ రాహుల్ నేతృత్వంలో పని చేయడం విషయంలోనే భాగస్వామ్య పక్షాలలో వేరు అభిప్రాయం ఉన్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముంగిట తొలుత జేడీయూ ఇండియా కూటమి నుంచి వైదొలగి ఎన్డీయే గూటికి చేరడం, తృణమూల్ వచ్చేసార్వత్రిక ఎన్నికలలో ఒంటరి పోరుకే మొగ్గు చూపడంతో విపక్షాల ఐక్యత ఎండమావి చందంగా మారిపోయింది.  ఎస్పీ కూడా కూటమిలో కొనసాగుందుకు ఆమోదయోగ్యం కానీ షరతులు విధించడంతో  వచ్చే ఎన్నికల ముంగిట విపక్షాల ఐక్యత దేవతా వస్త్రంగా మారిపోయింది. సరిగ్గా ఈ తరుణంలోనే కాంగ్రెస్ లోని ఒక బలమైన వర్గం నుంచి ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక అన్న ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. వాస్తవానికి గత కొంత కాలంగా పార్టీ వ్యవహారాలలో  ప్రియాంకా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. 

2019 ఎన్నికల్లో వారణాసి నియోజక  వర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ మీద పోటీ చేసేందుకు కూడా ప్రియాంక రెడీ అయ్యారు. అయితే  అందుకు  సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అందుకు అంగీకరించ లేదు. అలాగే, 2019 ఓటమి తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, కాడి వదిలేసిన సందర్భంలోనూ, పార్టీ పగ్గాలు ప్రియాంకకు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చింది. అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ కుడా ఇచ్చారు. అయితే రాహుల్ గాంధీ, ఫస్ట్ ఫ్యామిలీ బయటి వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే షరతు విధించడంతో రెండవ సారీ ఆమె వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎన్నికల ముంగిట.. మరో సారి ప్రియాంక ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలన్న ప్రతిపాదన గట్టిగా ముందుకు వచ్చింది.  దీనికి ప్రియాంక స్పందన కంటే ర ాహుల్, సోనియాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్న అనుమానాలే పార్టీ వర్గాలలోనూ పరిశీలకులలోనూ బలంగా వ్యక్తం అవుతున్నాయి.