వారం రోజుల్లో మరో  రెండు గ్యారెంటీలు అమలు 

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఆరు గ్యారంటీల పథకాల్లో  ఒక్కోటి అమలవుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదటి గ్యారెంటీ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దీన్ని అమలు చేస్తున్నారు. రెండో గ్యారంటీ 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించి డేట్ కూడా ఫిక్స్ చేసింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌ హామీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో వారం రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్‌ను అందించనున్నట్టు తెలిపారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గీలో నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం సహా పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. ఆరు ఎన్నికల హామీల్లో రెండింటిని ఇప్పటికే అమలు చేశామన్నారు. 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తయ్యింది. కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధి ఆలోచన, విజన్‌తో అడుగులు వేస్తోంది.  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని   కేసీఆర్‌ కుటుంబం వ్యక్తిగతంగా నిందలు వేసి, ప్రజల్లో లేని ఒక వ్యతిరేకతను సృష్టించాలని చూస్తుందని వక్రమార్గంలో  అధికారంలోకి రావాలని చూస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సహకరిస్తామని తెలుపుతూనే, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్ని పార్టీలు కోరుతున్నాయి. కాంగ్రెస్‌ కూడా ఎన్నికల ప్రచారంలో పలుమార్లు ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పింది. అసలు ఈ ఆరు గ్యారెంటీలు అమలుచేయడానికి పూర్తిగా దృష్టి పెట్టింది. 
 సిలిండర్‌ రూ.500కు ఇస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా సిలిండర్లను మార్కెట్‌ రేటుకు అనువుగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. అంటే ఇది ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలు అని చెప్పాలి. ఇప్పటికే కేంద్రం ఇస్తున్న ఎల్‌పీజీ సౌభాగ్య పథకం కింద ఉన్నవారిని ఇందులో అర్హులుగా చేర్చుతారా అనేది తేలాల్సి ఉంది. అంటే రేషన్‌ కార్డున్న వారికి గ్యాస్‌ సిలిండర్‌పై కొన్ని ఆంక్షలుంటాయని తెలుస్తోంది. వారం రోజుల్లో మరో రెండు గ్యారెంటీలను అమలుచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వారం రోజుల్లో రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, తెల్లరేషన్‌ కార్డుదారులందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అమలు చేస్తామని వెల్లడించారు.మార్చి 15లోగా అందరికీ రైతుబంధు అందజేస్తామని తెలిపారు. రైతు రుణమాఫీ బాధ్యత తనదేనని చెప్పారు. రాష్ట్ర ప్రజలను ఆర్ధిక ఇబ్బందుల నుంచి కాపాడటానికి, ప్రజల సుఖ, సంతోషాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రకటించిన, ప్రజలు మెచ్చుకొన్న 6 గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేయవచ్చునని పలువురు సీనియర్ ఆర్ధికవేత్తలు వివరించారు. ఈ ఆరు గ్యారెంటీలు గొంతెమ్మ కోర్కెలేమీ కాదని, కష్టాల్లో ఉన్న ప్రజల కోసం ఒక సంక్షేమ ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన పనులేనని, అయితే ఆర్ధిక క్రమశిక్షణను పాటిస్తూ, ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని పెంచుకునే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూనే, రుణ పరిమితిని పెంచుకోవాల్సి ఉంటుందని ఆ ఆర్ధికవేత్తలు సూచించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించి, ప్రజల మన్ననలను పొందటమే కాకుండా ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం చేసి సంచలనం సృష్టించడంతో ఈ ఆరు గ్యారెంటీలు ఏమిటి, వాటిని అమలు చేయడానికి ప్రభుత్వ ఖజానాపై అదనంగా ఎంత భారం పడుతుంది… ఆరు గ్యారెంటీల అమలుకు ఎంతమేరకు నిధులు అవసరవుతాయి… అనే అంశాలపై ఆర్ధిక నిపుణులు, ఆర్ధికశాఖలోని పలువురు సీనియర్ అధికారుల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఆరు గ్యారెంటీల అమలుకు మొత్తం సుమారు 94,156 కోట్ల రూపాయల (రూ.95 వేల కోట్లు) నిధులు అవసరమవుతాయని ప్రాధమిక అంచనా.
 కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన వెంటనే తాము ఆరు గ్యారెంటీలకు అదనపు నిధులు ఎంత మేరకు అవసరమవుతాయనే అంశాలపై అధికారులు  లెక్కలు  వేశారు. ఆ మేరకు ప్రాథమికంగా అంచనాలు రూపొందించగా 94,156 కోట్ల రూపాయలుగా తేలిందని, రానున్న రోజుల్లో లబ్దిదారుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నందున ఈ ఆరు గ్యారెంటీలకు 95 వేల నుంచి ఒక లక్ష కోట్ల రూపాయల వరకూ ఖర్చులు పెరుగుతాయని వివరించారు. అయితే ఈ ఆరు గ్యారెంటీలకు అవసరమైన నిధులన్నింటినీ ప్రణాళికా వ్యయంలోనే చూపించి ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, రెవెన్యూ వ్యయం కింద కూడా నిధులను కేటాయించుకోవచ్చునని, ఈ ఆరు గ్యారెంటీల్లో సర్వీస్ సెక్టార్, సంక్షేమ రంగాలకు సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉన్నాయని, అందుచేతనే ప్లాన్ బడ్జెట్ (ప్రణాళిక వ్యయం) భారీగా పెరుగుతుందేమో, అందుకు నిధులను ఎక్కడి నుంచి తెస్తామనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.
నాన్-ప్లాన్ బడ్జెట్ లో కూడా ఈ ఆరు గ్యారెంటీలకు నిధులను కేటాయించుకొని ఖర్చులు చేసుకోవచ్చునని వివరించారు. అప్పులు ఎలా ఉన్నా… ప్రతి ఏటా చెల్లింపులు, వడ్డీల రూపంలో చెల్లింపులు చేసే ఖర్చులు ఏడాదికి సుమారు 13 వేల కోట్ల రూపాయల వరకూ ఉన్నాయని, అయినప్పటికీ నిధులను ఆరు గ్యారెంటీలకు విజయవంతంగా ఖర్చు చేయవచ్చునని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాలో చివరి వరసలో ఉందని, రాష్ట్ర జిడిపిలో కేవలం 28 శాతం మాత్రమే అప్పులున్నాయని, దేశంలోని 28 రాష్ట్రాల్లో అప్పులు చేసిన రాష్టాల  జాబితాలోని వరుస క్రమంలో తెలంగాణ 23వ స్థానంలో ఉందని, మిగతా రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలన్నీ 30 శాతం నుంచి 46 శాతం వరకూ అప్పులు చేశాయని వివరించారు. న్యాయంగా, చట్టబద్ధంగా రుణాలను సేకరించుకోవడానికి తెలంగాణ రాష్ట్రానికి ఇంకనూ ఎన్నో అవకాశాలున్నాయని, వాటన్నింటినీ సద్వినియోగం చేసుకొని కష్టాల్లో ఉన్న తెలంగాణ ప్రజలను ఆదుకోవడానికి ఈ ఆరు గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేయవచ్చునని ఆ అధికారులు వివరించారు.తెలంగాణ రాష్ట్రంలోని మహిళా లోకాన్ని విశేషంగా ఆకట్టుకొన్న వంటగ్యాస్ సిలిండర్‌ను 500 రూపాయలకే అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలంటే రాష్ట్రంలోని 90 లక్షల కుటుంబాలకు ఏడాదికి ఎనిమిది సిలిండర్ల లెక్కన గ్యాస్‌బండ సబ్సిడీ భారం 3,276 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి అని అంచనా. అదేవిధంగా గృహజ్యోతి పథకంలో మహిళలకు నెలకు 2500 రూపాయల లెక్కన ఒక్కో మహిళకు ఏడాదికి 30 వేల రూపాయల లెక్కన 90 లక్షల కుటుంబాలకు ఏడాదికి 27వేల కోట్లు రూపాయల నిధులు అవసరమవుతున్నాయి. రాష్ట్రంలోని 45 లక్షల మంది పెన్షనర్లకు నెలకు 4 వేల రూపాయల లెక్కన ఏడాదికి 21,600 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి అని అంచనా. 
ఇక నిరుద్యోగ యువతను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం రేయింబవళ్ళూ కష్టపడి చేసిన యువతను ఆదుకోవడానికి ప్రవేశపెట్టిన “యువ వికాసం” పథకంలో 50 లక్షల మంది విద్యార్ధులకు ఏడాదికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలను చెల్లిస్తే 25 వేల కోట్లు రూపాయల నిధులు అవసరమవుతాయని వివరించారు. ఇక కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు గంపెడాశలు పెట్టుకొన్న 12 వేల రూపాయలను చెల్లిస్తే రాష్ట్రంలోని 54 లక్షల మంది కూలీలు, కౌలు రైతుల కోసం ఏడాదికి 6,480 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది.  గృహ విద్యుత్తులో ప్రతి ఇంటికీ 200 యూనిట్ల వరకూ ఉచితంగా కరెంటును సరఫరా చేస్తే రాష్ట్రంలోని 90 లక్షల ఇళ్ళకు ఏడాదికి 10,800 కోట్ల రూపాయల అదనపు ఖర్చు అవుతుంది.