అభిమన్యులెవరో అంతుపట్టని...ఉత్తర్ ప్రదేశ్ పద్మవ్యూహం! 


ఉత్తర్ ప్రదేశ్...దేశంలోని చాలా రాష్ట్రాల మాదిరిగా ఇది కూడా ఒకటి అనుకుంటే పొరపాటే!ఉత్తర్ ప్రదేశ్ లోని కాశీకి భారతీయులంతా జీవితంలో ఒక్కసారైనా వెళ్లి రావాలనుకుంటారు.అలాగే,దేశంలోని జాతీయ రాజకీయ నేతలంతా ఉత్తర్ ప్రదేశ్ ని తమ పొలిటికల్ కాశీగా భావిస్తారు.అక్కడి జనాల ఆశీస్సులు పొందితే ఢిల్లీ చేజిక్కినట్టే అనుకుంటారు.నిజానికి కాంగ్రెస్ దశాబ్దాల పాటూ హస్తినాపురాన్ని హస్తగతం చేసుకుంది ఉత్తర్ ప్రదేశ్ ఉత్తమ ఫలితాలతోనే!కాని,ఇప్పుడు అదే ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఉత్తపార్టీగా మారిపోయింది.ప్రాంతీయ పార్టీ అయిన సమాజ్ వాది అనుగ్రహం కోసం నానా తంటాలు పడుతోంది...


లక్నోలో తమ లక్ తేల్చుకునేందుకు అనేక పార్టీలు ఎన్నికల బరిలో దిగుతున్నాయి.అందులో ముఖ్యమైనవి ఎస్పీ,బీఎస్పీ,కాంగ్రెస్,బీజేపి.ఈ నాలుగు పార్టీలు గతంలో యూపీని ఏలినవే.గాంధీ,నెహ్రుల పుణ్యామాని కాంగ్రెస్ చాలా కాలం అధికారం వెలగబెడితే బీజేపి రాముల వారి చలువతో రాజ్యం చేసింది.కాని,తరువాత చాలా కాలంగా ఒకవైపు నుంచి ఏనుగు,మరో వైపు నుంచి సైకిల్ హస్తాన్ని,కమలాన్ని సెక్రటేరియల్ వైపుకి రానీయటం లేదు.ఈసారన్నా ఆ ట్రెండ్ మారుద్దామని జాతీయ పార్టీలు తీవ్రంగా ఆరాటపడుతున్నాయి...


ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపి కన్నా కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా వుంది.ఒకప్పుడు వందల మంది ఎమ్మేలతో కళకళలాడిన ఆ పార్టీ ఇప్పుడు పాతిక మంది కూడా లేని స్థితిలో వుంది.మరో వైపు బీజేపి గత పార్లమెంట్ ఎన్నికల్లో డెబ్బైకి పైగా ఎంపీ సీట్లు గెలిచి కొత్త ఆశలతో చిగురిస్తోంది.అయితే,ఎలాగైనా యూపీలో అధికార టోపీ పెట్టుకోవాలనుకున్న రాహుల్ ప్రశాంత్ కిషోర్ లాంటి చాణుక్యుడ్ని పక్కన పెట్టుకొని నానా హంగామా చేశాడు.అయినా మంచాలు వేసి మీటింగ్ లు పెట్టిన ఆ ప్లానంతా మంచం పట్టిన కాంగ్రెస్ ని లేపి నిలపలేకపోయింది.ఇక ఎన్నికలు పూర్తిగా దగ్గరకి వచ్చేయటంతో అఖిలేషే దిక్కనుకుని పొత్తుకు సిద్ధమైంది.కాని,పరిస్థితి చూస్తుంటూ అఖిలేష్ తన సైకిల్ పై రాహుల్ ని ఎక్కనిచ్చేలా లేడు!


రెండుగా చీలిపోయిన సమాజ్ వాది పార్టీలోని అఖిలేష్ బ్యాచ్ తో చేతులు కలిపిన కాంగ్రెస్,రాష్ట్రీయ లోక్ దల్ లాంటి పార్టీలతో కలిపి మహాకూటమి ఏర్పడుతుందని ఆశపడింది.బీహార్లో మాదిరిగా ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపిని నేలకూల్చాలని కలలు కన్నది.కాని,ఏమైందో ఏమో కాని జాట్ లలో మంచి ఫాలోయింగ్ వున్న అజిత్ సింగ్ తన పార్టీ ఆర్ఎల్డీ కూటమి నుంచి ఔట్ అనేశాడు.ఇక చెప్పాపెట్టకుండా అఖిలేష్ తన రెండు వందల మంది అభ్యర్థుల జాబితా ప్రకటించేశాడు.ఎస్పీ అభ్యర్థుల్ని ప్రటించిన నియోజకవర్గాల్లో అమేథీ,రాయబరేలి కూడా వున్నాయి.ఇవ్వి కాంగ్రెస్ కు పెట్టని కోటలు.అక్కడున్న ఎమ్మేల్యే స్థానాల్లో కూడా తన అభ్యర్థుల్ని ప్రకటించిన అఖిలేష్ కాంగ్రెస్ ను పొమ్మన లేక పొగబెడుతున్నట్టే వుంది!


యూపీలో పొలిటికల్ సీన్ చూస్తుంటే...మైనస్ మార్కులు తెచ్చిపెట్టే తప్పుడు యాన్సర్ లాంటి కాంగ్రెస్ ను ఎవ్వరూ కోరుకుంటున్నట్టు లేదు.ఆల్రెడీ మాయావతి తనది ఒంటరి పోరని చెప్పేయటం,అఖిలేష్ కూడా అదే పద్దతిలో ముందుకు పోతుండటం కాంగ్రెస్ ను ఒంటరిని చేసేస్తోంది.అటు బీజేపి మోదీ ఛరిష్మాని,అమిత్ షా వ్యూహాల్ని నమ్ముకుని రంగంలోకి దిగుతుంది.మొత్తం మీద కాంగ్రెస్,బీజేపి,బీఎస్పీ,ఎస్పీల చతుర్ముఖ పోరు తప్పేలా లేదు!


మన హైద్రాబాద్ నుంచి బయలుదేరిన ఎంఐఎం కూడా యూపీలో కొన్ని ఓట్లు చీల్చే పనిలో పడింది.ఇలా చిన్నా చితకా పార్టీలు,పెద్ద పార్టీలు ఎన్ని ఎక్కువైతే బీజేపికి, బీఎస్పీకి అంత మంచిదంటున్నారు విశ్లేషకులు.ఆ రెండు పార్టీల్లో ఏదో ఒకటి మెజార్టీ సంపాదించటమో,లేక పోత్తుతో ప్రభుత్వం ఏర్పాటు చేయటమో జరుగుతుందంటున్నారు!ఈ విషయం అఖిలేష్ కి,రాహుల్,ప్రియాం,సోనియా గాంధీలకి తెలియదనుకోలేం...