తెలుగు రాష్ట్రాల్లో ‘ముందస్తు’ ముచ్చట్లు.. తెలంగాణతో పాటే జగనూ..!

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హీట్ ఓ రేంజ్ లో ఉంది. రెండు రాష్ట్రాలలోనూ కూడా ముందస్తుపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఆ ఊహాగానాలకు బలం చేకూర్చేలా కనిపించిన వారికీ, కనిపించని వారికీ, అడిగిన వారికీ, అడగని వారికీ కూడా ఏపీ మంత్రులు ముందస్తు ఉండవని చెబుతున్నారు. ఇక తెలంగాణలో అయితే స్వయంగా కేసీఆరే ముందస్తు ప్రశక్తే లేదని చెప్పినా.. తెరాస గత చరిత్ర తెలిసిన వారు ముందస్తే అంటూ నమ్ముతున్నారు. 

ఏది ఏమైనా తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే వచ్చే ఏడాది చివరిలో ఎన్నికలు జరుగుతాయి. అయితే ఏపీలో మాత్రం 2024లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాల్సి ఉంది.  తెలంగాణతో పోలిస్తే ఏపీలో వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాల కొనసాగింపు ప్రశ్నార్థకంలో పడింది. ఆ పథకాలు కొనసాగించలేక నిలిపేయాల్సిన పరిస్థితి ఎదురైతే... ప్రభుత్వ ప్రతిష్ట మంటగలవడం ఖాయం, ఆ ప్రభావం ఎన్నికలపై పడటం తథ్యమని పార్టీ పెద్దలే భావిస్తున్నారు. స్వయంగా పార్టీ అధినేత జగన్ కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో ఎన్నికల హీట్ ను పెంచేలా ఎమ్మెల్యేలకు మార్కులు గ్రేడులూ కేటాయిస్తు పరుగులెత్తిస్తున్నారు. ఇవన్నీ జగన్ ముందస్తు తొందరను సూచిస్తున్నా..అధికారికంగా మాత్రం ఐదేళ్లూ కొనసాగి, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెడతామంటూ వైసీపీ మంత్రులు అడిగిన వారికీ అడగని వారికీ చెప్పేస్తున్నారు. 

అయితే ఏపీ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోనికి తీసుకుంటే జగన్ ముందస్తుకు వెళ్లే అవకాశాలే ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే అందుకు ముహూర్తం ఎప్పుడన్న విషయంలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది చివరి నాటికి తెలంగాణ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంతో పాటే ఏపీలో కూడా ఎన్నికలు జరిగేలా జగన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని అంటున్నారు. అలా చూసుకున్నా.. ప్రస్తుతం జగన్ సర్కార్ అమలు చేస్తున్న ఉచిత పథకాలు మరో ఏడాది పైన కొనసాగించాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థతి ఏపీకి ఉందా అన్న సందేహం వ్యక్తమౌతున్నది. ఏది ఏమైనా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ‘ముందస్తు’ ముచ్చట్లపై ఇరు రాష్ట్రాల ప్రజలలో ఆసక్తి కనిపిస్తున్నది. తెరాస ఆనవాయితీ ప్రకారం, ఏపీ అవసరం రిత్యా ముందస్తుకే మొగ్గు చూపుతాయని పరిశీలకులు అంటున్నారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu