కరెంటు, రోడ్లు, నీళ్లు.. ఏపీ ఇజ్జత్ తీసిన కేటీఆర్
posted on Apr 29, 2022 1:20PM
కేటీఆర్ మాటలు వింటే జగనన్న తలెక్కడ పెట్టుకుంటాడో! ఏపీ ఇజ్జత్ మొత్తం తీసేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఆయనేమీ అబద్దాలు చెప్పలేదు. లేనిపోని ఆరోపణలు కూడా చేయలేదు. వాస్తవం పరిస్థితే వివరించారు. అదికూడా క్రెడాయ్ సమావేశంలో ఏపీ బండారం బట్టబయలు చేయడంతో.. ఇకపై రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయో రావో అనే ఆందోళన. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ దుస్థితిని, దౌర్భాగ్యాన్ని కళ్లకు కట్టేలా వివరించారు. ఏపీలో విపరీత కరెంట్ కోతలు, ఊరూరా గుంతలు మయమైన రోడ్లు, తాగు-సాగు నీటి కష్టాలను ప్రపంచానికి తెలిసేలా.. జగన్‌కు తెలిసొచ్చేలా.. కీలకమైన క్రెడాయ్ వేదికగా గొంతెత్తి చాటారు కేటీఆర్. ఇంతకీ ఆయన ఏమన్నారంటే....
ఏపీని ఉద్దేశించి క్రెడాయ్ సమావేశంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రంలో పరిస్థితిపై మిత్రులు చెప్పిన మాటలంటూ ఏపీ దుస్థితిని సభాముఖంగా వివరించారు. "పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని, రోడ్లన్నీ ధ్వంసమై ఉన్నాయని మిత్రులు చెప్పారు. అక్కడ పరిస్థితి అధ్వానం, అన్యాయంగా ఉందన్నారు. మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చాక ఊపిరి పీల్చుకున్నట్లు ఉందని చెప్పారు. నేను చెప్పేదేది అతిశయోక్తి కాదు. పక్క రాష్ట్రం వెళ్లి తెలుసుకోవచ్చు. తెలంగాణ గురించి నేను డబ్బా కొట్టుకోవడం కాదు.. మీరే వెళ్లి చూడండి. పక్క రాష్ట్రం వెళ్లి చూసి వస్తే మీరే మమ్మల్ని అభినందిస్తారు" అని కేటీఆర్ అన్నారు.
కేటీఆర్ మాట్లాడింది ఆంధ్రప్రదేశ్ గురించేనని అందరికీ తెలిసిందే. చంద్రబాబు హయాంలో సన్‌రైజ్ స్టేట్‌గా ఏపీ అభివృద్ధి, అమరావతి రాజధాని గురించి.. యావత్ దేశం, ప్రపంచంలో చర్చ జరగ్గా.. అందరూ నవ్యాంధ్రపై ఆసక్తి కనబరచగా.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. ఒక్కఛాన్స్ అంటూ అందలమెక్కిన జగనన్న.. ఏపీని అంథకారప్రదేశ్‌గా మార్చేశారు. ఎడాపెడా కరెంట్ కోతలు. అసలే ఎండాకాలం. ఎప్పడు కరెంట్ తీసేస్తారో తెలీదు. ఎన్నిగంటలు పవర్ కట్ ఉంటుందో చెప్పరు. విపరీతమైన ఉక్కబోత. కరెంట్ లేక టార్చర్. వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు విషమ పరీక్ష. టార్చ్‌లైట్ వెలుగుల్లో ఆసుపత్రుల్లో ఆపరేషన్లు చేస్తున్న దైన్యం. చంద్రబాబు హయాంలో ఒక్క గంట కూడా కరెంట్ కోత అనే మాటే వినిపించలేదు. జగన్‌రెడ్డి పాలనతో మాత్రం ఒక్క గంట కరెంట్ ఉంటే అదే అదృష్టం అనేలా దాపురించింది.
ఇక రోడ్ల సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చంద్రబాబు కాలంలో వేసిన రోడ్లు మినహా.. ఈ మూడేళ్లలో కొత్తగా ఒక్క రోడ్డు కూడా వేసిన పాపాన పోలేదు వైసీపీ. ఎక్కడికక్కడ దారుణంగా దెబ్బతిన్నాయి రహదారులు. కనీసం గుంతలు పూడ్చేందుకు డబ్బులు కూడా లేవు సర్కారు దగ్గర. అప్పులతో బతికేస్తోంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమైపోతోంది. ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేనాని ఉద్యమం చేసినా.. ఉలుకూపలుకు లేదు ఈ తోలుమంది పాలకులకు అంటున్నారు.
ఏపీ వాస్తవ పరిస్థితిని క్రెడాయ్ లాంటి సమావేశంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యూహాత్మకంగా ప్రస్తావించారని అంటున్నారు. ఆయన మాటలు విన్నాకైనా.. జగన్‌రెడ్డికి జ్ఞానోదయం అయితే బాగుంటుంది. ఒకప్పుడు ఏపీ గురించి ఎలా మాట్లాడుకునే వారు.. ఇప్పుడు ఎలాంటి మాటలు వినిపిస్తున్నాయి. అంతా ఒక్కఛాన్స్ దౌర్భాగ్యం అంటున్నారు ఏపీ ప్రజలు. చేసిన పాపం అనుభవిస్తున్నామంటూ ఆవేదన చెందుతున్నారు.