ఆ నకిలీ బాంబుల వెనుక అసలు కథేమిటీ?
posted on Jun 25, 2012 11:27AM
కడప జిల్లా జమ్మలమడుగులో కలకలం సృష్టించిన నకిలీబాంబుల వెనుక అసలు కథేమిటీ అన్న ఆసక్తి నెలకొంది. పోలీసుల పనితీరుకు ఇది ఒక పెద్దసవాల్‌గా నిలుస్తోంది. విధ్వంసాలు సృష్టించాలనుకునే వారు ఎంత స్వేచ్ఛగా తిరగొచ్చో ఈ నకిలీబాంబుల ఉదంతం బయటపెడుతోంది. దొరికింది నకిలీబాంబయినా పోలీసు నిఘా విభాగంలో ఉన్న డొల్లతనం బయటపడుతోంది. అలానే ప్రజల్లో పెరిగిన విధ్వంసకాలపై అవగాహనకూ ఈ సంఘటనే నిదర్శనంగా తీసుకోవచ్చు. ఎవరో ఒకరు సమాచారం ఇస్తే కానీ, పోలీసులు కళ్లు తెరవడంలేదు.
ఆలస్యమైతే జరగాల్సింది జరిగిపోతుందని నకిలీబాంబుల సంఘటన హెచ్చరిస్తోంది. ఒక బకెట్‌లో నకిలీబాంబులు పెట్టి గుర్తుతెలియని వ్యక్తులు జమ్మలమడుగులో రద్దీ ఎక్కువగా ఉండే సంజామల రోడ్డులో పెట్టారంటే దీని వెనుక ఏదో కుట్రకు తెరలేపుతున్నారని నిఘావర్గాలు ఇకనైనా గుర్తిస్తే మంచిది. ఒకసారి పెట్టినట్లే మరోసారి అసలుబాంబులను పెట్టేందుకు ఉగ్రవాదులు ఎందుకు కుట్రపన్నకూడదు? ఈసారి చూసినట్టే మరోసారి స్థానికులు చూసి అసలుబాంబును గుర్తించలేకపోతే పరిస్థితి ఏమిటీ? ఈ రెండు ప్రశ్నల ఆధారంగా నిఘావర్గాలు దర్యాప్తు చేస్తేనే అసలు విషయం బయటకు వస్తుంది.