రామసముద్రం కోడిపుంజుకు ఆథార్‌కార్డు
posted on Jun 26, 2012 11:34AM
చిత్తూరు జిల్లాలోని రామసముద్రం గ్రామంలో కోడిపుంజుకు ఆథార్‌కార్డ్‌ను మంజూరు చేశారు. పైగా, 517417 పిన్‌కోడ్‌ను ఆ కార్డుపై చిరునామాలో భాగంగా ముద్రించారు. అంతే కాకుండా సన్‌ఆఫ్ కోడిపెట్ట అని కూడా పేరు కింద రాసి ఉంది. 2011 జనవరి 22న ఈ కార్డు మంజూరైంది. ఆథార్ నెంబరు కూడా దీనిపై ముద్రించబడటం విశేషం. ఈ కార్డు డెలివరీ కోసం రామసముద్రం పోస్టుమ్యాన్‌కు చేరింది. ముందు ఆ కార్డును చూసి ఆ ఊర్లో కోడిపుంజు పేరు మీద ఎవరైనా ఉన్నారా? అని పోస్టుమ్యాన్ వెతికేసుకుంటూ చివరిలో మరోసారి కార్డును చూసి షాకయ్యారు. సన్‌ఆఫ్ కోడిపెట్ట అని రాయటం పోస్టుమ్యాన్‌ను షాక్‌కు గురిచేసింది. ఇంతకీ ఆ కార్డు ఎలా డెలివరీకి వచ్చిందో అర్థం కాలేదు. మరి ఎవరి ముఖచిత్రమూ లేకుండా కోడిపుంజు పేరిట కార్డు రావటం ఓ షాకయ్యే అంశం. అసలు ఆథార్‌కార్డుకు మనుష్యులు అటెండయితేనే ఇంకా డెలివరీ కావటం లేదని అన్ని జిల్లాల్లోనూ ఆందోళన చెందుతున్నారు. అటువంటిది కోడిపుంజు పేరు మీద అసలు కార్డు ఎలా మంజూరు చేశారు? ఆకతాయిల పనే అనుకుంటే కార్డుల మంజూరులో జరుగుతున్న అవకతవకలకు ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. రామసముద్రం అన్న గ్రామంలో ఇలా కార్డు మంజూరైందంటే ఆథార్‌కార్డ్ సిబ్బంది తప్పా? లేక నిర్లక్ష్యం రాజ్యమేలుతోందా? అన్న అంశం తేల్చాలని పలువురు కోరుతున్నారు.