తోక "చుక్క" తెచ్చింది

వినడానికి కొంచం విడ్డూరంగా ఉన్నా కొన్నిసార్లు కొన్ని నిజాలు నమ్మక తప్పుదు. అలాంటిదే ఇప్పుడు జరిగింది. అదేంటంటే అంతరిక్షంలో ఆల్కహాల్ ఉత్పత్తి అవడం. అక్కడ ఎవరు ఆల్కహాల్ ఉత్పత్తి చేస్తున్నారా అని అనుకుంటున్నారా... దీని కారణం లవ్ జాయ్ అనే ఒక తోకచుక్కట. లవ్ జాయ్ అనే తోకచుక్క సెకనుకు 500 బాటిళ్ల ఆల్కహాల్ ను అంతరిక్షంలోకి విడిచిపెడుతోందట.. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌లోని ప్యారిస్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అతిశీతల వాతావరణం కలిగిఉన్న ఈ లవ్ జాయ్ అనే తోకచుక్క ఈ ఏడాది జనవరి 30 న సూర్యుని దగ్గరకు వచ్చిందట. అయితే సూర్యుని వేడికి ఇది సెకనుకు 20 టన్నుల నీటి ఆవిరిని రోదసిలో విడుదల చేయగా దీనిలో 500 బాటిళ్లకు సమానమైన ఇథైల్ ఆల్కహాల్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మరి మందుబాబులకు ఈ విషయం తెలిస్తే రాకెట్ వేసుకొని అక్కడికి కూడా వెళిపోతారేమో..