ఈ బీరు తాగితే ఆరోగ్యమట!

మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ మాట మనం లక్షసార్లు వినే ఉంటాము. కాకపోతే మోతాదులో పుచ్చుకుంటే మద్యం వల్ల ఉపయోగం ఉంటుందని కొందరు నమ్ముతుంటారు. అప్పుడప్పుడూ ఓ గుటక వేస్తే తప్పేంటని మరికొందరు వాదిస్తుంటారు. మొత్తానికి మద్యం తాగేవాళ్లు సర్వకాల సర్వావస్థల్లోనూ కనిపిస్తూనే ఉంటారు. ఇలాంటి మందుబాబులకి ఇప్పుడు ఓ శుభవార్త!


ప్రోబయాటిక్‌ అన్న పదం ఇప్పుడు చాలా సందర్భాలలో వినిపిస్తోంది. శరీరానికి మేలు చేసే సూక్ష్మజీవులనే మనం ప్రోబయాటిక్స్‌ అంటున్నాము. రోగంతో పాటుగా శరీరానికి కూడా హాని తలపెట్టే యాంటీబయాటిక్‌ మందుల కంటే, ఇప్పుడు ప్రోబయాటిక్‌ మందులకే వైద్యులు ప్రాధాన్యతని ఇస్తున్నారు. మున్ముందు ఆహారపదార్థాలకి కూడా ఈ ప్రోబయాటిక్స్‌ను కలిపి తినే రోజులు రానున్నాయి.


ఇంత మంచి ప్రోబయాటిక్స్‌ను బీరులో ఎందుకు కలపకూడదన్న ఆలోచన వచ్చింది సింగపూర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులకి. కానీ బీరులో ప్రోబయాటిక్స్‌ బతకడం దాదాపు అసాధ్యం! బీరులో ఉండే ‘హాప్‌ యాసిడ్స్‌’ అనే రసాయనాలతో ప్రోబయాటిక్స్‌ మనుగడ సాగించడం అసాధ్యం. అందుకని దాదాపు తొమ్మిదినెలలపాటు శ్రమించి ప్రోబయాటిక్స్‌కు అనుకూలంగా ఉండే బీరు తయారీ విధానాన్ని కనుగొన్నారు.


బీరు తయారీలో మార్పు తేవడం ద్వారా సగం పని పూర్తయింది. ఇక అందులోకి ఎలాంటి ప్రోబయాటిక్స్ అనుకూలమో గమనించే ప్రయత్నం చేశారు. Lactobacillus paracasei (L26) అనే పదార్థమైతే బాగుంటుందని తేల్చారు. పాలల్లో కనిపించే లాక్టిక్‌ యాసిడ్‌లో ఒక రకమే ఈ L26. మన పేగులలో కనిపించే ఈ ప్రోబయాటిక్‌ శరీరంలోని హానికారక రసాయనాలకి (toxins) విరుగుడుగా పనిచేస్తుందట. వైరస్‌ను ఎదుర్కోవడంలో, రోగనిరోధకశక్తిని పెంపొందించడలో కూడా ఇది ముఖ్యపాత్ర పోషిస్తుందని తేలింది. ఇక ఇలాంటి ప్రోబయాటిక్ ఉన్న బీరు తాగితే ఆరోగ్యం గ్యారెంటీ అంటున్నారు. ఈ బీరుని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ఏదన్నా సంస్థ ముందుకు వస్తుందేమో అని ఎదురుచూస్తున్నారు.

 

- నిర్జర.

Related Segment News