మన చర్మం మీద ఒక జీవి బతుకుతోంది తెలుసా!

మనకి పైపైన కనిపించే చర్మం వేరు. కాస్త సూక్ష్మంగా చూస్తే అందులో ఒక ప్రపంచమే ఉంటుంది. స్వేదరంధ్రాలు, బ్యాక్టీరియా, వెంట్రుకల కుదుళ్లు... ఇలా చర్మం కాస్త వింతగా కనిపిస్తుంది. కానీ దాని మీద ఒక ఏకకణ జీవి (unicellular organism) కూడా బతికేస్తోందని ఈ మధ్యనే బయటపడింది. ఇక అప్పటి నుంచి దాని లక్షణాలు ఏమిటి, లాభనష్టాలు ఏమిటి అన్న చర్చ మొదలైంది.

 

మన చర్మం మీద ఆర్కియా అనే ఏకకణజీవి బతుకుదోందని ఈమధ్యనే గ్రహించారు. ఏడాది వయసున్న పిల్లవాడు మొదలుకొని 75 ఏళ్ల వృద్ధుల వరకూ అనేకమందిని పరిశీలించిన తర్వాత తేలిన విషయమిది. ఎక్కడో అంటార్కిటికా మంచుపలకల మీదా, వేడి నీటి బుగ్గలలోనూ మాత్రమే ఉందనుకునే ఈ చిత్రమైన జీవి ఏకంగా మన శరీరం మీదే నివసిస్తోందని బయటపడింది.

 

ఆర్కియా మన చర్మాన్ని ఆశించి బతికేస్తోందని తేలిపోయింది. కానీ దీని వల్ల లాభమా నష్టమా అన్న ఆలోచన మొదలైంది. పొడిచర్మం ఉన్నవారి మీద ఈ ఆర్కియా చాలా ఎక్కువ మోతాదులో కనిపించింది. బహుశా వారి చర్మాన్ని శుభ్రంగా ఉంచేందుకు ఇది దోహదపడుతూ ఉండవచ్చు. అలాగే 12 ఏళ్లలోపు పిల్లలలోనూ, 60 ఏళ్లు దాటిన వృద్ధులలోనూ ఆర్కియా ఎక్కువగా కనిపించింది. బహుశా ఆయా వయసులలో సున్నితంగా ఉండే చర్మాన్ని ఈ ఆర్కియా కాపాడుతూ ఉండవచ్చు.

 

అంతేకాదు! చర్మం మీద కనిపించే ఆర్కియా, అమ్మోనియా మీద ఆధారపడి జీవిస్తోందని తేలింది. మన చెమటలో అమోనియా ఒక ముఖ్యభాగం. ఆ అమోనియా మన చర్మం మీద పేరుకుపోకుండా ఈ ఆర్కియా ఉపయోపడుతోందని భావిస్తున్నారు. చర్మం మీద PH లెవల్స్ని తగ్గించడంలో కూడా ఈ జీవి ఉపయోగపడుతోందన్నది మరో విశ్లేషణ. PH లెవల్స్ తక్కువగా ఉంటే ఇన్ఫెక్షన్లు కూడా తక్కువగా ఏర్పడతాయి.

 

ఆర్కియా ఉపయోగాలు సరే! మరి అది మన శరీరం మీద అధిక మోతాదులో పేరుకుపోతే కలిగే అనర్థాలు ఏమిటో తెలియడం లేదు. పైగా వ్యోమాగాములు అంతరిక్షంలో తిరిగేటప్పుడు, వారితో పాటుగా ఈ జీవులు కూడా ఇతర గ్రహాల మీదకి చేరే అవకాశం ఉంది. MARS వంటి గ్రహాల మీదకి కనుక ఈ ఆర్కియా చేరితే, అక్కడి వాతావరణం మొత్తం కలుషితం అయిపోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.

 

లాభమో, నష్టమో! మొత్తానికి మన చర్మానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సంగతి బయటపడింది. ఇహ వైద్యప్రపంచంలో ఆర్కియాకి ఒక కొత్త అధ్యాయం మొదలైంది.

- నిర్జర.