బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు పీక్స్ కు?

గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలైన నాటి నుంచీ బీఆర్ఎస్ సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకు పోతున్నట్లుగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రతిపక్ష స్థానంలోకి వచ్చి పదేళ్లయినా ఇంకా కుదురుకోలేదు. హైడ్రా, మూసీ ప్రక్షాళన వంటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలతో పుంజుకోవడానికి వచ్చిన అవకాశాలను సైతం ఆ పార్టీ అంతర్గత విభేదాలతో చేజార్చుకుంటోంది. దీనికి తోడు పార్టీ అధినేత ఓటమి తరువాత ఫాం హౌస్ కే పరిమితం కావడం కూడా పార్టీ రోజు రోజుకూ క్షీణించడానికి కారణంగా మారింది.  గత పది నెలలుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు మూడు సందర్భాలతో తప్ప ప్రజలలోకి వచ్చింది లేదు. పార్టీ నేతలకు కూడా అందుబాటులోకి రావడం లేదని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఒక విధంగా ఒక్క పరాజయంతో కేసీఆర్ కాడె వదిలేశారని పార్టీ శ్రేణులే భావిస్తున్నాయి. 
అధినేత నిష్క్రియాపరత్వం కారణంగా పార్టీలో ఆధిపత్య పోరు పీక్స్ కు వెళ్లిందంటున్నారు.  ముఖ్యంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి, కేసీఆర్ తనయుడు అయిన కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) మాజీ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు అయిన హరీష్ రావుల మధ్య పార్టీ నిట్టనిలువుగా చీలిపోయిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. బీఆర్ఎస్ రెండవ శ్రేణి నాయకత్వం, క్యాడర్ లో చాలా వరకూ మాజీ మంత్రి హరీష్ రావు  వెనుక ర్యాలీ అవుతుంటే.. బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీలో తన స్థానాన్ని, ఆధిపత్యాన్నీ నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో కేటీఆర్, హరీష్ రావుల మధ్య పెరిగిన దూరం పార్టీలో సమన్వయం లేకుండా పోవడానికి కారణమౌతోంది.  

మాజీ మంత్రి హరీష్ టార్గెట్ గా కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నా.. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావుకు పెద్దగా మద్దతు లభించడం లేదు. సిద్దిపేటలో హరీష్ రావు రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు, పోస్టర్లూ వెలిసినా, కేటీఆర్  పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు.   రైతు రుణమాఫీ విషయంలో హరీష్ రావు రాజీనామా చేయాలని, లేదంటే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించడానికి కూడా కేటీఆర్ ఎందుకో ముందుకు రాలేదు.  

దీంతో తనపై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావే స్వయంగా కౌంటర్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలను గమనిస్తున్న పరిశీలకులు బీఆర్ఎస్ లో వర్గపోరు ఆరంభమైందనీ, ఇది కేటీఆర్ వర్సెస్ హరీష్ రావుగా రూపాంతరం చెందడానికి పెద్దగా సమయం తీసుకునే అవకాశాలు లేవనీ అంటున్నారు.  ఈ ఊహాగానాలు ఇలా సాగుతుండగానే.. వాటికి బలం చేకూర్చే విధంగా తాజాగా కేటీఆర్  తాజాగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ కోసం ఏర్పాటు చేసిన స్క్రీన్ పై  రెండు బీఆర్ఎస్ లోగోలు ఉన్నాయి.

వాటిలో ఒక దానిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫొటో ఉంటే.. రెండో దానిపై కేటీఆర్ ఫొటో ఉంది. దీంతో బీఆర్ఎస్ లో హరీష్ రావు ప్రాధాన్యత తగ్గించి పార్టీ పగ్గాలను కేటీఆర్ చేపట్టనున్నారన్న వాదన పార్టీ శ్రేణుల్లోనే మొదలైంది. కేటీఆర్ ప్రణాళికాబద్ధంగా పార్టీలో హరీష్ ప్రాధాన్యతను తగ్గించే విధంగా పావులు కదుపుతున్నారన్న భావన వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో కూడా హరీష్ కు పార్టీలో అన్యాయం జరుగుతోందంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.  మొత్తం మీద బీఆర్ఎస్ లో అంతర్గత పోరు పతాకస్థాయికి చేరిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి.