అన్నవరం ప్రసాదంలోనూ కల్తీ?!

ఇప్పటికే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం విషయం వెలుగులోకి రావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు కల్తీ నెయ్యి వినియోగం విషయంపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్వతంత్ర సిట్ దర్యాప్తు చేపట్టనుంది. ఆ విషయం అలా ఉండగానే.. శబరిమల ప్రసాదంలోనూ కల్తీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయకుండా నిలిపివేశారు. ఇప్పుడు తాజాగా అన్నవరం సత్యన్నారాయణ స్వామి ప్రసాదంలోనూ కల్తీ జరుగుతోందని వెల్లడైంది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరంలో  కొలువై ఉన్న సత్యనారాయణ మూర్తి దేవాలయంలో భక్తులకు అందజేసే ప్రసాదంలో కల్తీ జరుగుతోందని తాజాగా వెలుగులోకి వచ్చింది. అన్నవరం సత్యదేవుని ప్రసాదాన్న భక్తుల పరమ పవిత్రంగా భావిస్తారు. అన్నవరం ప్రసాదం రుచి విషయంలో ఎంతో ప్రసిద్ధి పొందింది. భక్తులు సత్యదేవుని  దర్శించుకున్న తరువాత ఎంతో భక్తితో ప్రసాదాన్ని ఆరగిస్తారు. అంతే కాకుండా తిరుమల దేవుని ప్రసాదంలాగే అన్నవరం సత్యదేవుని ప్రసాదాన్ని కూడా తమ తమ ఊర్లకు తీసుకువెళ్లి అందరికీ పంచుతారు. అన్నవరం ప్రసాదాన్ని ఎర్ర గోధుమనూక, ఆవు నెయ్యి, బెల్లం, యాలకుల పొడితో తయారుచేస్తారు. ఈ ప్రసాదం సుగంధభరితంగా ఉంటుంది.  ఎండిన విస్తరాకులో ఈ ప్రసాదాన్ని పెట్టి అందిస్తూ ఉంటారు. 

అయితే ఇప్పుడు ఆ ప్రసాదం తయారీలో కల్తీ బెల్లం విడుతున్నట్లుగా వెలుగులోనికి వచ్చింది. సుక్రోజ్ శాతం అధికంగా ఉన్న బెల్లంతోనే సత్యదేవుని ప్రసాదాన్ని తయారు చేస్తున్నట్లు కల్తీ నిరోధక శాఖ నిర్ధారించింది. బెల్లం, నెయ్యి నాణ్యతను పరిశీలించకుండానే ఆలయ అధికారులు ప్రసాదం తయారీకి వినియోగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ప్రసాదం తయారీకి వినియోగించే బెల్లాన్ని ఒక ప్రైవేటు సంస్థ అతి తక్కువ ధరకే సరఫరా చేస్తోందని అంటున్నారు. ప్రసాదం తయారీకి వినియోగించే బెల్లంలో కల్తీ ఉందని అధికారులు పేర్కొన్నారు.