నమ్మకానికి ఉన్న శక్తి ఎలాంటిదో తెలుసా?

నమ్మకం లేకుండా ఈ సృష్టే లేదుకదా?!  మనిషి తన జీవితంలో ఏమి చేయాలన్నా నమ్మకమే ప్రముఖ పాత్ర పోషిస్తుంది.నమ్మకం ఉంటే ఎంతటి పనిని అయినా చేయడానికి నడుం బిగిస్తారు. అదే నమ్మకం లేకపోతేనో… ఆలోచించండి. నమ్మకం లేకుండా ఈ ప్రపంచంలో ఎలాంటి విజయమైనా, ఎలాంటి విషయాలైనా జరుగుతాయా?

ఆలోచించండి. నమ్మకం అనేది ఈనాడు మరో ప్రతిసృష్టినే చేయగలదు. మంచినీ, చెడునీ రెండింటిని చేయగలదు. కానీ ! మనం మంచిని మాత్రమే నమ్ముదాం. గెలుపును మాత్రమే నమ్ముదాం... అద్భుత విజయం మనకు చేకూరబోతుందని నమ్ముదాం. ఇలా చేయడం వల్ల మనిషి తన జీవితంలో తాను ఎంతో అత్యున్నత స్థాయికి ఎదగగలడు. మాటల్లో చెప్పినంత, వందకు వంద శాతం కాకపోయినా కనీసం మనిషి ఆశించిన మేరకు సాధించగలడు. 

 ఒక నెలలో కోటి రూపాయలు సంపాదించాలని అనుకుంటున్నారా! మీరు మీ సొంత విమానంలో దేశదేశాలూ తిరగాలని అనుకుంటున్నారా! ప్రపంచంలోనే గొప్ప వ్యాపారవేత్త కావాలని అనుకుంటున్నారా! ఇవన్నీ... ఎటువంటి సందేహం  లేకుండా... నిస్సంకోచంగా ఎవరైనా, ఎలాంటి వారైనా... ఎంత పేదవారైనా, ధనికులైనా సాధించరు. కానీ ఒక్క విషయం... మీరు అది చెయ్యలేనేమో ... ఇది సాధ్యమేనా అని ఆలోచనలను బలవంతంగా తుడిచివేసి... నూటికి నూరుపాళ్ళు నేను చెయ్యగలను అని నమ్మండి. ఈ నమ్మకమే ఎంతటి అసాధ్యమునైనా సాధింపజేస్తుంది. ఇప్పుడు విమానాల్లో తిరుగుతున్న వారు, పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు స్థాపించినవారిలో స్వంతంగా ఎదిగినవారు బోలెడు మంది ఉన్నారు. వారందరూ మనవల్ల ఏమవుతుందిలే… అనుకుని ఉంటే ప్రస్తుతం ఆ స్థాయికి చేరగలిగేవారా??

నమ్మకం అందరిలోనూ ఒకటే కదా… ఒక్కొక్కరికి ఒకో విధమైన మెదడు ఇవ్వలేదు ఆ భగవంతుడు. కానీ మనిషి ఆలోచనే వెరైపోతోంది… ఈ సృష్టినే సృష్టించగల నమ్మకం... మీకు  విజయాన్ని ఇవ్వలేదా? నమ్మండి. బలవంతంగానో లేక ఇష్టంగానో లేక నమ్మకంగానో  మొత్తానికి నమ్మకాన్ని మనసులో బలంగా నాటుకొండి. 

మీరు నమ్మడం వలన కలిగే లాభం ఏంటో తెలుసా...! మీరు కోరుకున్న మహోన్నత విజయం.. మీకు లభిస్తుంది. మీరు ఎందుకు ఈ విషయాలను నమ్మాలంటే...

ఒక నమ్మకం పనిచేసే తీరును మీకు వివరిస్తుంది. మీ విజయానికి కావాల్సిన శక్తిని, నేర్పును, మార్గాలను మీకు  చూపిస్తుంది. నేను గొప్పగా మారగలను అనే నమ్మకమే... మీరెలా మారాలి అనే దారిని చూపిస్తుంది. విజయం సాధించడానికి మార్గాలను ఏర్పరుస్తుంది. ఎంతటి విజయాన్నైనా సాధించడానికి కావాల్సిన అత్యవసరమైన అతి ముఖ్యమైన మొట్టమొదట అర్హత ఏంటో తెలుసా... "నేను సాధించగలను" అని నమ్మడం. 

నమ్మకానికి అపరిమితమైన శక్తి ఉంది. అది మిమ్మల్ని ఎంత ఎత్తుకైనా చేరుస్తుంది. ఎంతో శ్రమకోర్చి... ఎన్నో అనుభవాల నుంచి, మరెందరో విజేతల జీవితాల నుండి ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. ఎందరో విజయవంతుల జీవితాల్లోని ప్రతి మాటా ప్రతి విషయమూ సూటికి నూరుపాళ్ళూ మీకు విజయం చేకూర్చడానికి... ఉద్దేశించబడిందే. అయితే నమ్మకంతో మీ మనసు చెప్పే మాటను మనస్ఫూర్తిగా నమ్మడం మొదలు పెట్టండి... ఖచ్చితంగా... మీరు మారడం మొదలు పెడతారు. విజయం సాధించేదాకా వెనుదిరగరు. “ఎందుకంటే నమ్మకమే విజయం" “సందేహమే ఓటమి" ఈ విషయాలు మరవకండి.

                                    ◆నిశ్శబ్ద.