మళ్ళీ 'దేశం'వైపు చూస్తున్న డికె ఆదికేశవులనాయుడు?
posted on Apr 19, 2012 10:42AM
డికె ఆదికేశవులనాయుడు ఒక విచిత్రమైన రాజకీయనాయకుడు. ఒక ఫ్యాక్టరీలో ఇంజనీరుగా పని చేస్తూ చివరకు ఆ ఫ్యాక్టరీకే యజమాని అయిన ఆదికేశవులు మద్యం వ్యాపారం కూడా ప్రారంభించి కోట్లకు పడగలెత్తారు. వ్యాపారం విషయంలో స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉన్న ఆదికేశవులు రాజకీయాలకు సంబంధించి అటువంటి వైఖరిని ప్రదర్శించలేకపోతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేసి పి.వి.నరసింహారావుకు సన్నిహితుడిగా మెలిగిన ఆదికేశవులు అనంతరం తెలుగు దేశం పార్టీలో చేరారు. అక్కడ కూడా ఇమడలేక వైఎస్ హయాంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చెరి టిటిడి చైర్మన్ పదవిని పొందారు. వై.ఎస్. మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డిని వ్యక్తిగతంగా ద్వేషించారు. ఆయనపై ఉన్న ద్వేషంతో తెలుగుదేశం పార్టీలో చేరటానికి మంతనాలు జరిపారు. అయితే తాను తెలుగుదేశం పార్టీలో చేరాలంటే తన అనుచరుడు జంగాలపల్లె శ్రీనివాస్ కు తిరుపతి టిక్కెట్టు ఇవ్వాలని షరతు పెట్టారు.
ఈ షరతును చంద్రబాబునాయుడు అంగీకరించకపోవటంతో ఆదికేశవులు మాట మార్చాడు. తాను అసలు తెలుగుదేశం పార్టీలో చేరతానని మీకెవరు చెప్పారని విలేఖరుల మీద విరుచుకుపడ్డారు. అయితే ఇక్కడితో కథ ముగిసిపోలేదు. మళ్ళీ ఆయన తెలుగుదేశం పంచన చేరాలని తాజాగా యోచన చేస్తున్నట్లు తెలిసింది. దీనిలో భాగంగా తన అనుచరుడు జంగానపల్లి శ్రీనివాస్ ను ముందుగా తెలుగుదేశం పార్టీలోకి పంపుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లోపే ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తికి ఎంతో కొంత లాభం కలుగుతుందన్నది పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి భావనగా కనిపిస్తోంది.