హర్ష - మల్లాడి మధ్య చిచ్చుపెట్టిన రీజెన్సీ
posted on Apr 19, 2012 10:44AM
యానాంలోని రీజెన్సీ కర్మాగార వివాదం రెండు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిథుల మధ్య చిచ్చుపెట్టింది. ఈ వివాదం కారణంగా యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, అమలాపురం ఎంపి జీవి హర్షకుమార్ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. వీరిద్దరి మధ్య వైరం, ఒకరినొకరు బహిరంగంగానే బెదిరించుకునే స్థాయి వరకూ చేరింది. ఇటీవల యానాం ఎమ్మెల్యే మల్లాడి క్రుష్ణారావు యానాం అసెంబ్లీలో మాట్లాడుతూ తనను హత్య చేయించడానికి అమలాపురం ఎంపి హర్షకుమార్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణల తరువాత యానాం ప్రభుత్వం మల్లాడి కృష్ణారావుకు భద్రతను పెంచాల్సి వచ్చింది. ఈ ఇద్దరు నాయకులు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారైనా ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావటం విశేషం.
యానాం రీజెన్సీ సిరామిక్స్ టైల్స్ ఫ్యాక్టరీపై కార్మికులు దాడిచేసి దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఫ్యాక్టరీ వైస్ చైర్మన్ ను హత్య చేశారు. అయితే కార్మికవ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న రీజెన్సీ యాజమాన్యానికి మల్లాడి కృష్ణారావు తొత్తుగా మారారని హర్షకుమార్ ఆరోపిస్తున్నారు. అక్కడి సంఘటనలను క్రిష్ణారావే బాధ్యత వహించాలని ఆయన చెబుతున్నారు. అయితే కార్మికులను హర్షకుమార్ తన స్వార్థ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టారని ఫలితంగా ఇప్పుడు వారికి నిలువనీడ కూడా లేకుండా పోయిందని మల్లాడి కృష్ణారావు విమర్శిస్తున్నారు. రీజెన్సీ వివాదంకాని, వీరిద్దరి మధ్య వైరంకాని కనుచూపు మేరలో సమిసిపోయే అవకాశం కనిపించటం లేదు.