లోపముందని కుంగిపోతున్నరా? ఒక్కసారి ఇది చదవండి! 

మహాభారతంలో ఉన్న ఓ చిన్న పాత్ర అనూరుడు. పుట్టుకతోనే రెండు కాళ్ళూ లేనివాడు. అయితేనేం... ప్రత్యక్ష భగవానుడయిన, లోకానికి వెలుగులు విరజిమ్మే సూర్యుడికి రథసారథిగా ఎదిగినవాడు  అనూరుడు. అంగవైకల్యం బాహ్య శరీరానికే కానీ ఆత్మశక్తికి కాదని నిరూపించిన ధీశాలి అనూరుడు. ఆత్మస్థైర్యం ఉంటే, సంకల్పబలం ఉంటే, మనశ్శక్తిని నమ్ముకొంటే కన్ను, కాలు, చేయి... ఇలా ఏ అవయవం లేకపోయినా జీవితంలో అత్యున్నత స్థితిని చేరుకోవచ్చని చెప్పే కథే అనూరుడి వృత్తాంతం.

మనందరం మనలో ఏదో ఒక లోపాన్ని చూసుకొని బాధపడుతూంటాం. ఉద్యోగం లేదని ఒకరు, పెళ్ళికాలేదని ఒకరు, సొంత ఇల్లు లేదని మరొకరు, పదో తరగతి తప్పామని ఇంకొకరు, జ్వరం వచ్చిందని వేరొకరు, డబ్బులు లేవని మరొకరు, అందం లేదని ఇంకొకరు... ఇలా ఏదో ఒక లోపం చూసుకొని కన్నీరవుతాం. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్లు... ఎవరి కష్టం వారికి మహా ప్రళయంలా, పెనుతుపానులా, యమగండంలా తోస్తుంది. అది సహజం కూడా!

అయితే ఇవన్నీ మనం అనుకొంటున్నట్లు నిజంగా లోపాలేనా? ఉద్యోగం, డబ్బు, పదవి, అధికారం, హోదా… ఇవన్నీ నిజంగానే మనిషికి సంతోషాన్ని, విశ్వాసాన్ని ఇస్తాయా? పైపైన చూస్తే నిజమే అనిపిస్తుంది. లౌకిక ప్రపంచంలో భౌతికంగా సుఖంగా ఉండేందుకు ఇవన్నీ అవసరమైతే అవ్వొచ్చేమోగానీ నిజానికి మనిషిని నిలబెట్టేది, మనిషిని అడుగు ముందుకు వేయించేది, మున్ముందుకు నడిపించేది, పెనునిద్దుర వదిలించేది, సమస్య వచ్చినా కన్నీరు కార్చకుండా నిలబెట్టేది, కష్టం వచ్చినా కుంగిపోకుండా కాపాడేది, పాతాళంలోకి పడిపోయినా... తిరిగి పైకి ఎగబాకి... ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహింప చేసేది మాత్రం ఖచ్చితంగా ధనమో, ఉద్యోగమో, అధికారమో మాత్రం కాదు. మరి ఏమిటి?

ఆత్మ విశ్వాసం,  మానసికబలం. సందేహంలేదు నిజానికి మనకు మనమే ఓ ఆయుధ భాండాగారం. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తువ వుంది.. ఇంతకు మించిన సైన్యమేది? ఆశ మనకు అస్త్రం. శ్వాస మనకు శస్త్రం. ఇంతకన్న ఏం కావాలి? మనకు మనమే... మన శరీరమే మనకు... మన ప్రాణమే మనకు... మన అవయవాలే మనకు... ఆయుధాలు. విచిత్రం ఏమిటంటే... ఖడ్గానికి స్వయంగా యుద్ధంలో పాల్గొనడం తెలీదు.

ఖడ్గచాలనం చేసే సైనికుడిదే, వీరుడిదే ఆ నైపుణ్యమంతా! కత్తి తిప్పడం తెలియకుంటే ఎంత గొప్ప ఖడ్గం అయినా శత్రువును ఓడించలేదు. అదే విధంగా మన శరీరం, మన అవయవాలు బాగా ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆత్మశక్తి లేనప్పుడు, మనపై మనకు విశ్వాసం లేనప్పుడు, సంకల్పబలం లేనప్పుడు, గుండెలోతుల్లో భయం ఉన్నప్పుడు... అవయవాలన్నీ కుదురుగా, అందంగా ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అంటే... అవయవ శక్తి కన్న బాహ్యబలం కన్న మించినది ఆత్మబలం, మనోబలం.


                                          *నిశ్శబ్ద.