వేలానికి డైనోసర్ పుర్రె..162 కోట్లకు అమ్ముడయ్యే అవకాశం
posted on Nov 17, 2022 9:48PM
జురాసిక్ పార్క్ సినిమా తరువాత డైనోసర్ అనే పదం ఆబాలగోపాలానికీ అత్యంత ఇష్టమైనదిగా మారిపోయింది. ప్రస్తుతం భూమి మీద ఉన్న ఎవరూ చూడని ఆ భారీ జీవి.. ఒక్క సినిమాతో అందరి హృదయాలనూ దోచేసుకుంది. పార్కుల్లో, జూపార్కుల్లో వాటి నమూనా చిత్రాలు అనివార్యమైపోయాయి.ప్రపంచ వ్యాప్తంగా ఆ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసింది. స్పిల్ బర్గ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను జనం ఎగబడి చూశారు. మనం నడయాడుతున్న ఈ భూమి మీద ఇంతటి భారీ జంతువులు తిరిగేవా అని ఏళ్ల తరబడి చర్చించుకున్నారు.
అలాంటి జీవికి చెందిన ఒక పుర్రె ఇప్పుడు బయటపడింది. దానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయిపోయాయి. ఎప్పుడో 76 మిలియన్ సంవత్సరాల కిందట జీవించిన డైనోసర్ పుర్రె మెక్సికోలో బయటపడింది. ఆ పుర్రె దాదాపు 6 అడుగుల పొడుగు ఉంది. దాని బరువే 200 పౌండ్లు ఉంది. ఇప్పుడు ఊహించుకోండి ఒక్క పుర్రె సైజూ బరువూ ఇంత భారీగా ఉంటే ఇక డైనోసర్ కాయం ఎంత భారీగా ఉంటుందో. గ్రాఫిక్స్ లో సినిమాలో డైనోసర్ ను చూసే యావత్ ప్రపంచం అచ్చెరువోందింది.
బాపురే ఇంతటీ భారీ జీవులు ఈ భూమి మీద నివశించాయా? అని జనం ఆశ్చర్యపోయారు. నమ్మలేం అంటూ వాదులాడుకున్నారు. అలాంటిది ఇప్పుడు డైనోసార్ లు భూమిమీద నివశించాయని శాస్త్రీయ ఆధారాలు బయటపడుతున్నాయి. అలాంటి శాస్త్రీయ ఆధారమే ఇప్పుడు మెక్సికోలో లభించిన డైనోసార్ పుర్రె కూడా. ఈ పుర్రెను న్యూయార్క్ లో లైవ్ సేల్ కు పెట్టారు. ఈ వేలం వచ్చే నెల9న జరగనుంది. ఇది దాదాపు 162 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నిజమే మరి అంతటి భారీ పుర్రెకు ఆ మాత్రమైనా ధర రాకపోతే ఎలా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.