దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా గుడికి బాంబు బెదిరింపు

 

దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్ళు జరిగి రెండేళ్ళు గడచినా ఆనాటి విషాదకర జ్ఞాపకాలు ఇప్పటికీ అందరి కళ్ళ ముందు మెదులుతూనే వున్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌లోన ప్రఖ్యాత సాయిబాబా దేవాలయానికి సోమవారం నాడు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ దేవాలయంలో బాంబు ఉన్నట్టుగా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. దాంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు పట్టారు. ఆలయంలోని భక్తులందరికీ బయటకి పంపించి, ఆలయ పరిసరాలను అణువణువూ మెటల్ డిటెక్టర్లతో గాలించారు. ఈ తనిఖీల సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన కొన్ని సీసీ కెమెరాలు పనిచేయకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. వాటిని వెంటనే బాగుచేయించాలని దేవాలయ నిర్వాహకులను ఆదేశించారు. అలాగే ప్రతిరోజూ ఈ దేవాలయంలో యాచకులకు అన్నదాన కార్యక్రమం జరుగుతూ వుంటుంది. ఇకపై అన్నదాన కార్యక్రమాన్ని పార్సిల్ అందించే విధంగా నిర్వహించాలని పోలీసులు ఆలయ నిర్వాహకులకు సూచించారు. పోలీసులు జరిపిన తనిఖీలలో ఆలయం పరిసరాల్లో బాంబులేవీ లేనట్టు తేలింది. అయితే ఈ బాంబు బెదిరింపు స్థానికులలో, భక్తులలో మాత్రం ఆందోళన కలిగించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu