చికెన్ కోసం తన్నుకున్న పోలీసులు
posted on Feb 23, 2015 3:15PM

చికెన్ మాంఛి టేస్టుగా వుంటుంది. అయితే దానికోసం ఇద్దరు పోలీసులు తన్నుకునేంత టేస్టుగా మాత్రం వుండదు. ఈ బుద్ధి లేని ఇద్దరు పోలీసులు చికెన్ కోసం తన్నుకున్నారు. చిత్తూరు జిల్లా పీలేరు పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ విభాగంలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చంద్ర, కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చలపతి ఇద్దరూ జిగిరీ దోస్తులు. మామూళ్ళు బాగా వచ్చాయేమో ఓ ధాబాలో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. మందుగుండు సామగ్రి రెడీ చేసుకున్నారు. మందు కొడుతూ, చికెన్ నంచుకుంటూ కాసేపు బాగానే ఎంజాయ్ చేశారు. అయితే మందు బాగా ఎక్కిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది. ఎందుకయ్యా అంటే, చికెన్ పంపకాల్లో తేడా వచ్చింది కాబట్టి. నాకంటే నువ్వే ఎక్కువ చికెన్ తిన్నావంటే, నువ్వే ఎక్కువ చికెన్ తిన్నావంటూ ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటూ రోడ్డుమీదకె ఎక్కారు. ఒకర్నొకరు చావబాదుకుని ఇద్దరూ గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత ఇద్దరూ పీలేరు పోలీస్ స్టేషన్లో ఒకరి మీద మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. వీళ్ళని ‘పోలీసులు’ అనడానికే సిగ్గేస్తోంది కదూ?