కరీంనగరా.. కరినగరా?
posted on Dec 15, 2022 12:03PM
తెలంగాణ బీజేపీ కరీంనగర్ కు కొత్తగా నామకరణం చేసిందా? కరీంనగర్ ను కరినగర్ గా ఏకపక్షంగా మార్చేసిందా? అంటే ఆ పార్టీ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర 5వ విడత ముగింపు సభ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ప్రకటనలలో కరీంనగర్ పేరును కరినగర్ గా పేర్కొంది. దీంతో అందరూ కరీంనగర్ పేరు కరినగర్ గా ఎప్పుడు మారింది అన్న సందిగ్ధంలో పడ్డారు. మరి కొందరేమో ముద్రారాక్షసమంటూ చర్చ లేవదీశారు.
చివరకు తేలిందేమిటంటే.. పూర్వ కాలంలో కరీంనగర్ ను కరినగరంగా పిలిచేవారట. ఎందుకంటే కరి అంటే ఏనుగు.. ఎనుగులు ఎక్కువగా తిరిగే ప్రదేశం కనుక అప్పట్లో కరీంనగర్ ను కరినగరంగా పిలిచేవారట.. కాలక్రమేణా నాటి కరినగరంపేరు కరీంనగర్ గా స్థిరపడిందట. ఇప్పుడు పాత చరిత్ర పుటలను తిరగేసి బీజేపీ ఏకంగా ఏకపక్షంగా కరీంనగర్ ను కరినగర్ గా మార్చేసింది. అయినా బీజేపీకి ఇలా నగరాలు, ప్రదేశాల పేర్లను మార్చేయడం కొత్తేమీ కాదు.
బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచీ దేశంలోని పలు నగరాలకు పున: నామకరణం చేస్తూ వస్తోంది. యూపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని పలు నగరాల పేర్లే మార్చేశారు. కర్నాటకలోనూ బీజేపీ ప్రభుత్వం అదే చేసింది. తెలంగాణలో కూడా తమ పార్టీ అధికారంలోకి వచ్చాకా పలు నగరాల, ప్రాంతాల పేర్లు మారుస్తామని చెబుతోంది. అయితే రాష్ట్రంలో ఇంకా అధికారంలోకి రాకుండానే బీజేపీ కరీంనగర్ కు కరినగరంగా నామకరణం చేసేసింది.
ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సందర్భంగా ఇచ్చిన అడ్వర్టైజ్ మెంట్లలోనూ, పోస్టర్లు, ఫ్లెక్సీలలోనూ కరీంనగర్ అని కాకుండా కరినగర్ అని పేర్కొంది. బీజేపీ పేర్ల మార్పు ప్రహసనంపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని పేర్ల మార్పు ప్రక్రియను బీజేపీ చేపట్టిందన్న విమర్శలు ఉన్నాయి.
ఇక కరీంనగర్ విషయానికి వస్తే కరీం అంటే మైనారిటీ వర్గానికి సంబంధించిన పేరు అంటూ అసలు కరీంనగర్ వాస్తవ నామం కరినగర్ అంటూ వాదిస్తోంది. ఇటీవల తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ భైంసా పర్యటన సందర్బంగా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే భైంసా పేరును మార్చేస్తామని ప్రకటించారు. ఎప్పటి నుంచో హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామంటూ వస్తున్నారు. హిందుత్వ అజెండాలో భాగంగానే బీజేపీ ఈ విధంగా వ్యవహరిస్తోందన్న విమర్శలకు ఆ పార్టీ అసలు ఖాతరు చేయడం లేదు.