ధోనీ చెంప పగులగొట్టేవాణ్ణి....
posted on Apr 8, 2015 2:41PM

తాను విలేకరి అయినట్టయితే భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెంప పగులగొట్టేవాడినని క్రికెట్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ అన్నారు. ప్రపంచ కప్ క్రికెట్ ప్రారంభానికి ముందు ధోనీ మీద విమర్శల వర్షం కురిపించిన యోగరాజ్ మరోసారి తన గళం విప్పాడు. ‘‘ధోనీ ఏదోరోజు బికారి అయిపోతాడు. పైసాకి కూడా ఠికాణా లేకుండా పోతాడు. రావణుడి గర్వం ఎలా అణిగిందో ధోనీ గర్వం కూడా అలాగే అణిగిపోయే రోజు వస్తుంది. నా కుమారుడు యువరాజ్ సింగ్ వరల్డ్ కప్‌కి దూరం కావడానికి ధోనీయే కారణం. ధోనీ ఒక అహంకారి. నిజానికి ధోనీ స్థాయి చాలా చిన్నది. కేవలం మీడియా వల్లే అతను క్రికెట్‌లో రాణించాడు. మీడియానే అతణ్ణి గొప్పవాణ్ణి చేసింది. కానీ ఆ స్థాయిని పొందే అర్హత అతనికి లేదు. తనకు ఎంతో సహకరించిన మీడియాని చూసి అతను ఎగతాళిగా నవ్వుతాడు. నేనే విలేకరిని అయితే అక్కడే ధోనీ చెంప పగులగొట్టేవాడిని. ధోనీకి కూడా రావణాసురుడిలా ఏదో ఒక రోజు గర్వభంగం కలుగుతుంది. ధోనీ గురించి అతని సహచర క్రికెటర్లు చెప్పిన విషయాలు విన్న తర్వాత అతనిని మించిన దారుణమైన వ్యక్తి మరొకరు వుండరని అనిపిస్తోంది’’ అన్నాడు. అయితే తన తండ్రి యోగరాజ్ వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని యువరాజ్ సింగ్ స్పష్టం చేశాడు. ‘‘మీడియాలో ప్రసారమైన వ్యాఖ్యలతో నాకెలాంటి సంబంధం లేదు. ధోనీ నాయకత్వంలో ఆడటాన్ని ఆనందిస్తానని నేనున గతంలోనే చెప్పాను. అతనితో నాకు ఎలాంటి సమస్య లేదు. ధోనీ తండ్రి అయినందుకు అతన్ని కలుసుకుని శుభాకాంక్షలు చెప్పాలని అనుకుంటున్నాను’’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.