తెలంగాణలో కాశ్మీర్ ను తలపిస్తున్న వాతావరణం

తెలంగాణలో వాతావరణం కాశ్మీర్ ను తలపిస్తోంది. శీతాకాలంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో శుక్రవారం (జనవరి 2) ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉదయం ఎనిమిది గంటలకు కూడా విజిబులిటీ లేక  వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పది అడుగుల దూరంలో ఉన్న వాహనాలు కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంది. ద్విచక్ర వాహ నాలు, కార్లు, భారీ వాహ నాలు అన్నీ హెడ్‌లైట్లు వేసు కుని నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ముఖ్యంగా నాగార్జునసాగర్ హైవే మీదుగా ప్రయాణించే బస్సులు, లారీలు, ప్రైవేట్ వాహనాలు అప్రమత్తంగా కదలాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో విస్తారమైన అటవీ ప్రాంతం ఉండటం, ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ లో నమోదు కావడంతో పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉంది. ఇదే పరిస్థితి మరో రెండు మూడు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ దారిలో ప్రయాణించే వాహనదారులు అత్యంత జాగరూకతతో మెలగాలని సూచిస్తోంది. అదలా ఉంటే వాతావరణం మాత్రం తెల్లటి పొగమంచు తెరల మధ్య కాశ్మీర్ ను తలపించేలా అత్యంత సుందరంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu