రికార్డు టైంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు..దటీజ్ బాబు!
posted on Jan 2, 2026 10:09AM

ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదన దశ నుంచి నిర్మాణం పూర్తి చేసుకుని కార్యకలాపాలు ప్రారంభం కావాలంటే దశాబ్దాలు పడుతుంది. ఇటీవలే ముంబైలో రెండవ విమానాశ్రయ నిర్మాణం పూర్తయ్యింది. ఆ విమానాశ్రయం ప్రతిపాదన దశ, నిర్మాణాలను పూర్తి చేసుకుని కార్యకలాపాలు ప్రారంభం కావడానికి దాదాపు పాతికేళ్లు పట్టింది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై విషయంలోనే పరిస్థితి ఇది. ఇక గత దశాబ్ద కాలంగా బెంగళూరులో రెండవ విమానాశ్రయ నిర్మాణం కోసం స్థల అన్వేషణ ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది. అది ఎప్పుడు లభిస్తుంది? ఎప్పుడు నిర్మాణం మొదలౌతుంది? ఎప్పుడు పూర్తి అవుతుంది? ఎప్పటి నుంచి కార్యకలాపాలు ఆరంబమౌతాయి అన్న విషయం దేవుడికే తెలిలయాలి.
అయితే అందుకు భిన్నంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం ఆఘమేఘాల మీద పూర్తయ్యింది. ఈ నెల మొదటి వారంలోనే ట్రయల్ రన్ జరగనుంది. మరో ఆరు నెల్లలో కమర్షియల్ ఆపరేషన్స్ ఆరంభం కానున్నాయి. ముంబై, బెంగళూరు వంటి నగరాలలో దశాబ్దాలు పట్టిన పని ఏపీలో మాత్రం రెండేళ్ల లోపే పూర్తయ్యింది. అదీ చంద్రబాబు పాలనలో ఫాస్టెస్ట్ గవర్నెన్స్. అదీ చంద్రబాబు దక్షత, సమర్ధత. అనుకున్న పనులను పరుగులు పెట్టించే కార్యాచరణ.
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు.. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మించాలని 2016లో పథక రచన చేశారు. కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకొచ్చి.. భూసేకరణ పూర్తి చేసి.. 2019లో విమానాశ్రయం పనులు ప్రారంభించారు. అయితే 2019 లో అధికార బాధ్యతలు చేపట్టిన వైసీపీ సర్కార్.. ఎయిర్ పోర్టు పనులు పడకేసేలా వ్యవహరించింది. అపప్టికే పనులు ప్రారంభమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి 2023లో అప్పటి జగన్ మరో మారు శంకుస్థాపన చేయడం వినా సాధించిందేమీ లేదు. ఇక 2024లో చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి తిరిగి వచ్చింది. వచ్చీ రావడంతోనే భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల వేగం పెంచి.. కేవలం ఏడాదిన్నరలోనే అత్యుత్తమ ప్రమాణాలతో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేసింది. ఈ ఘనత నిస్సందేహంగా చంద్రబాబుదే.
ఉమ్మడి రాష్ట్రంలో 5 వేల ఎకరాల్లో శంషాబాద్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టుకు ప్లాన్ చేసింది కూడా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబునాయుడే. అప్పట్లో ఇంత భారీ ఎయిర్‌పోర్టు ఎందుకని ఎందరు ఎన్ని విమర్శలు చేసినా ఆయన లెక్క చేయలేదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, అనుమతులు తీసుకొచ్చి.. నిధులు సాధించి.. భూసేకరణ పూర్తి చేసి.. పనులు ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారినా.. బాబు ప్లాన్ ప్రకారమే విమానాశ్రయం నిర్మాణం జరిగింది. ఇది జరిగి పాతికేళ్లు అయ్యింది. ఇప్పుడు దేశంలోనే అత్యంత బిజీ ట్రాఫిక్ ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలలో శంషాబాద్ విమానాశ్రయం కచ్చతంగా ముందు వరుసలో ఉంటుంది. ఎంత ట్రాఫిక్ పెరిగినా.. హైదరాబాద్ కు మరో విమానాశ్రయం అవసరం పడలేదు. అదీ చంద్రబాబు మార్క్ విజన్ అంటే.
ఇక ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. రికార్డు టైంలో నిర్మాణం పూర్తి చేసుకుని కార్యక లాపాల ప్రారంభానికి ముస్తాబవ్వడమే అద్భుతం అనుకుంటే.. ఇందుకు మరో అద్భుతం కూడా తోడవుతోంది. అదే ఏవియేషన్ ఎడ్యుసిటీ నిర్మాణం. ఇప్పటికే ఈ ఎడ్యుసిటీ కి కావల్సిన 135 ఎకరాలను మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక గజపతి రాజు విరాళంగా ఇచ్చారు. దీంతో ఇక్కడి నుంచే వచ్చే రోజుల్లో పైలట్ ట్రైనింగ్ సెంటర్ ఆరంభం కానుంది. ఆపై ఇక్కడికి ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ కూడా రానుంది. దీంతో భోగాపురం ఎయిర్ పోర్టు వైభోగం రెట్టింపు కానుంది. దీంతో విశాఖ, విజయనగరం జిల్లాల దశ దిశ తిరిగిపోనుంది. దీంతో సీఎం చంద్రబాబుకు ఈ ప్రాంత వాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.