ఒంటిగంటకల్లా జాతకం తేలిపోతుంది
posted on Feb 10, 2015 6:44AM

ఈరోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య హోరాహోరీగా సాగిన శాసనసభ ఎన్నికల పోరులో ఢిల్లీ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో ఈరోజు స్పష్టం కానుంది. మధ్యాహ్నం ఒంటిగంటకల్లా ఏ పార్టీ జాతకం ఏమిటో తేలిపోనుంది. మొత్తం ఉదయం 8 గంటల నుంచి 14 కేంద్రాల్లో జరిగే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ ఎన్నికలలో రికార్డు స్థాయిలో 67.14 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 673 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఎగ్జిట్ పోల్స్ అనూహ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకుందని, అధికారం చేపడుతుందని ఫలితాలు ఇచ్చాయి. బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లు సాధిస్తే గొప్ప అని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అయితే భారతీయ జనతాపార్టీ మాత్రం తన విజయం మీద నమ్మకాన్ని ప్రదర్శిస్తోంది.