సేవకు అద్భుతమైన నిర్వచనం!
posted on Jan 25, 2023 9:30AM
ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఎంతో ప్రేమ, అభిమానం. ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో పెద్దాయనకు వివాహమైంది, పిల్లలు కూడా! కానీ చిన్నతను పెళ్ళి చేసుకోలేదు బ్రహ్మచారిగానే జీవిస్తూ ఉన్నాడు. వారిద్దరికీ ఉమ్మడిగా కొంత పొలం ఉంది. అది సారవంతమైంది కావటంతో ఏటా ఇబ్బడిముబ్బడిగా దిగుబడి వచ్చేది. ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా లాభాన్ని ఇద్దరూ చెరిసగం పంచు కునేవారు. ఇలా కొన్నేళ్ళు గడిచాక, ఒకరోజు అర్ధరాత్రి, ఆ అన్నయ్య నిద్దరలోంచి మేల్కొని ఆలోచించడం మొదలుపెట్టాడు. 'అరే! నా తమ్ముడి విషయంలో ఎందుకో అన్యాయం జరుగుతోందని అనిపిస్తోంది. నాకు పెళ్ళయింది పిల్లలున్నారు. భవిష్యత్తులో నా బాగోగులు చూసుకోవడానికి నాకు వాళ్ళున్నారు. కానీ, తమ్ముడిని ఎవరు చూసుకుంటారు! వాడికి ఏదో ఒకటి చేయాలి వచ్చిన లాభాల్లో వాడికి ఎక్కువ ముట్టజెబితే భవిష్యత్తులో భద్రతగా ఉంటుంది' అనుకొని ఒక నిర్ణయాని కొచ్చాడు.
వెంటనే మంచం దిగి, పొలానికి వెళ్ళి, కొంత ధాన్యాన్ని తీసుకొని తమ్ముడి ధాన్యంలో కలిపాడు. మరోవైపు తమ్ముడు కూడా అన్న విషయమై ఆలోచించసాగాడు. 'నేను ఒక్కడిని, లాభాల్లో సగం వాటా తీసుకొని ఏం చేసుకుంటాను అన్నయ్యకు భార్య, పిల్లలు ఉన్నారు. ఆయనకు నా కన్నా ఎక్కువ అవసరాలుంటాయి. ఎలాగైనా, అన్నయ్యకు ఎక్కువ వాటా అందాలి' అనుకొని హుటాహుటిన వెళ్ళి, తన ధాన్యంలో కొంత ధాన్యాన్ని అన్నయ్య ధాన్యంలో కలిపాడు. ఇలా వీలున్నంత వరకు ఒకరికి తెలీకుండా, మరొకరు ప్రతి సంవత్సరం ఒకరికొకరు లాభపడేలా చూసుకునేవారు.
ఇలా ఒక రోజు అర్ధరాత్రి ఆ అన్నదమ్ములు ఒకరి ధాన్యంలో మరొకరు ధాన్యాన్ని కలిపివస్తూ ఒక దగ్గర కలుసుకోవడం ఆ ఊరిపెద్ద గమనించాడు. వారి ప్రేమాభిమానాలకు చలించిపోయాడు. వారి త్యాగగుణాన్ని ఊరంతా ప్రచారం చేశాడు. కొన్నేళ్ళకు ఆదర్శవంతమైన ఆ అన్నదమ్ములు గతించిపోయారు. ఒకానొక సందర్భంలో ఆ ఊరిలో గ్రామస్థులు ఆలయాన్ని కట్టించాలని అనుకున్నారు. దేవాలయ నిర్మాణానికి ఏది సరైన స్థలమనే చర్చ రాగా, గతంలో ఆ రాత్రి అన్నదమ్ములు కలుసుకున్న చోటే అనువైనదని తేల్చిచెప్పారు. నిస్వార్థం, త్యాగం నిండిన ఆ ఇద్దరి ఆదర్శం ఆలయరూపంలో తరతరాలకు ప్రసరింపచేయాలని నిర్ణయించారు. కానీ ఈ రోజుల్లో 'సేవ',''త్యాగం' అన్న పదాలకు అర్థాలే మారిపోతున్నాయి.
సమాజంలో ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్. వంటి ఉన్నతోన్నత ఉద్యోగాల ద్వారానే సేవ చేయ వచ్చనుకుంటున్నారు. పదానికున్న ప్రాధాన్యమే మారిపోయింది. ముఖ్యంగా నేటితరం నిత్యజీవితంలో త్యాగం, ఉదారత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, ఏదో ప్రత్యేక సందర్భంలో పళ్ళో, మిఠాయిలో పంచితే సరిపోతుందని అనుకుంటోంది. కానీ 'సేవ'కు మహోన్నతమైన స్థానం ఉంది. ఒకప్పుడు ఈ సేవ స్ఫూర్తితో వందలాది మంది తమ జీవితంలో సేవకు ప్రాముఖ్యత ఇచ్చారు. ఇతరుల మంచిని కాంక్షిస్తూ సేవచేస్తే పరోక్షంగా అది మన మంచికే ఉపయోగపడుతుందని తెలుసుకోవాలి. దీని వలన వ్యక్తిగా మన మూర్తిమత్వం వేయింతలవుతుంది, ప్రకాశిత మవుతుంది. స్వామి వివేకానంద మాటల్లో చెప్పాలంటే 'సేవలు పొందే వ్యక్తి కన్నా, సేవించే వ్యక్తే ధన్యుడు. సేవించుకునే అవకాశం కలిగించినందుకు ఎదుటివారికే మనం ఋణపడి ఉంటాం. ఆ భగవంతుడు తనను పూజించుకునే భాగ్యాన్ని, పరోపకారం రూపంలో ఇచ్చాడని తెలుసుకోండి. ఆరాధనగా భావించి 'సేవ' చేయటం అలవాటుగా చేసుకోండి'.అంటారు.
కాబట్టి సేవ అనేది మనిషికి జీవితంలో ఎంతో ముఖ్యం.
◆నిశ్శబ్ద.